స్కూల్లో విద్యార్థులకు పాఠాలు చెబుతూ ఓ ఉపాధ్యాయుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుండెపోటు కారణంగా ఆ టీచర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఒంగోలు జిల్లా వాకవారిపాలెంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. మృతుడు బాపట్ల జిల్లా పంగళూరుకు చెందిన పాలపర్తి వీరబాబుగా చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో వీరబాబు హెడ్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
శనివారం కూడా యధావిధిగా విధులకు హాజరైన హెడ్ మాస్టర్.. పాఠాలు చెబుతూ ఉండగా ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ రావడంతో అపస్మారకస్థితిలోకి చేరుకున్నారు. విద్యార్థులు గమనించి వెంటనే ఇతర ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఉపాధ్యాయులు 108కి కాల్ చేశారు. వారు ప్రాథమిక చికిత్స చేయగా.. అప్పటికే హెడ్ మాస్టర్ వీరబాబు మృతి చెందినట్లు 108 సిబ్బంది నిర్ధారించారు.
కాగా ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా పలువురు హార్ట్ ఎటాక్ కు గురై ప్రాణాలు విడుస్తున్నారు. జిమ్ చేస్తూ, బాడ్మింటన్ ఆడుతూ, పెళ్లి వేడుకల్లో ఇలా హార్ట్ స్ట్రోక్ తో ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు.