కడప : విద్య నేర్వనివాడు వింత పశువు అంటారు. విద్య నేర్పేవాడే వింత పశువుగా మారితే..? కడప జిల్లాలోని ఓ గ్రామంలో అలాంటిదే జరిగింది. మండల కేంద్రమైన లక్కిరెడ్డిపల్లిలో గల సందీప్ కాన్సెప్ట్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న యశ్వంత్ అనే విద్యార్థి హోమ్ వర్క్ చేయలేదని ఆ స్కూల్ కరస్పాండెంట్ శివ ఆ పిల్లాణ్ణి నిర్దాక్షిణ్యంగా చితకబాది వదిలిపెట్టాడు.
స్థానికులు గమనించి అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో స్కూల్ యాజమాన్యం గేటుకు తాళాలు వేసి మరీ వారిపై దౌర్జన్యానికి పాల్పడడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థిని విచక్షణారహితంగా చితకబాదిన కరస్పాండెంట్‌ను ప్రశ్నించడానికి వచ్చిన పత్రికా విలేకరులకు అనుమతి లేదని చెప్పి వారిని బయటకు గెంటి వేసేందుకు కరస్పాండెంట్ శివ ప్రయత్నించడం మరీ ఘోరం. విద్యార్థిని వాతలు తేలేట్టుగా కొట్టిన స్కూల్ నిర్వాహకులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. స్కూల్ కరస్పాండెంట్‌పై చర్య తీసుకోవాలని ఎంఇఓను కోరారు.
పిల్లలపై దెబ్బ పడనిదే చదువు అబ్బదనే వాదనకు ఎప్పుడో కాలం చెల్లింది. గ్లోబల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చిన నవీన సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటి నుంచే క్లాస్ లెసన్స్ నేర్చుకునే కాలమిది. టీచింగ్ మెథడ్‌లో కూడా అనేక మార్పులు వచ్చాయి. ఐనప్పటికీ మన గ్రామాల్లో అడపాదడపా ఇటువంటి అకృత్యాలు జరుగుతుండటం అనాగరికమనే చెప్పాలి.