జీవో 317 ఇష్యూను రాష్ట్రపతి, ప్రధాని దృష్టికి తీసుకెళ్తానన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆయనతో భేటీ అయింది. ఈ జీవో వల్ల వేలాదిమంది టీచర్లు తమ స్థానికతను కోల్పోవడం జరిగిందని రేవంత్ కి వివరించారు కమిటీ సభ్యులు. జీవోను రద్దు చేయాలని ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వివరించారు.
ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 29న జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ధర్నాలకు మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు వచ్చేలా చూడాలని కోరారు. అలాగే.. ఫిభ్రవరి 5న ఇందిరాపార్క్ లో జరిగే మహాధర్నాలో పాల్గొనాలని రేవంత్ ని ఆహ్వానించారు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ సభ్యులు.
ఉద్యోగ, ఉపాధ్యాయులు అధైర్యపడొద్దని ఈ సందర్భంగా ధైర్యం చెప్పారు రేవంత్ రెడ్డి. 317 జీవో రద్దుకై జరుగుతున్న పోరాటానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలిపారు. ఈ జీవో రాష్ట్రపతి ఉత్తర్వులకి భిన్నంగా ఉన్నందున ఈ అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించటమే కాకుండా ప్రధాని, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
317 జీవో మూలంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల స్థానికతకు విఘాతం కలుగుతోందని.. ప్రధాని జోక్యం చేసుకుని రద్దు చేసేలా ఫిబ్రవరి 5న హైదరాబాద్ వస్తున్న ఆయన్ను కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరుతామని తెలిపారు రేవంత్. అలాగే 13న హైదరాబాద్ విచ్చేస్తున్న రాష్ట్రపతితో కూడా ఈ అంశంపై మాట్లాడేందుకు అపాయింట్ మెంట్ కోరతామని చెప్పారు.
ఈ భేటీలో రేవంత్ రెడ్డితోపాటు టీపీసీసీ ఉపాధ్యక్షులు వేం నరేందర్ రెడ్డి, అధికార ప్రతినిధి మానవతారాయ్ పాల్గొన్నారు.