– స్పౌజ్ బదిలీలు చెపట్టండి
– గజ్వేల్ లో ఉపాధ్యాయుల నిరసన
– 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు చేపట్టాలని డిమాండ్
– దూర ప్రయాణాలతో తీవ్ర ఇబ్బందులు
– బోధనపై తీవ్ర ప్రభావం పడుతోంది
– పిల్లల చదువులకు ఇబ్బందులు కలుగుతున్నాయి
– ఆందోళనలో ఉపాధ్యాయ కుటుంబాలు
భర్త ఒక చోట.. భార్య మరొక చోట.. పిల్లలు, తల్లిదండ్రులు మరొక చోట.. ఐదు నెలలుగా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. సారూ.. జర స్పౌజ్ బదిలీలు చేపట్టండి అని టీచర్లు విజ్ఞప్తి చేశారు. ఇప్పటిదాకా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేసిన ఉపాధ్యాయ స్పౌజ్ బాధితులు.. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గాన్ని ఈసారి వేదికగా చేసుకుని తమ ఆవేదనను వినిపించారు.
సీఎం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో మిగిలిన 13 జిల్లాల్లో కూడా స్పౌజ్ బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. గజ్వేల్ లో స్టేట్ స్పౌజ్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఆవేదన సభ నిర్వహించారు. స్పౌజ్ బదిలీలకు దరఖాస్తులు స్వీకరించినా సమస్యను పరిష్కరించట్లేదని ఆరోపించారు. కొద్ది రోజుల్లో బడులు ప్రారంభం అవుతున్నాయని.. తమ గోడును పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు.
బోధనపై తీవ్ర ప్రభావం…
13 జిల్లాలో స్పౌజ్ బదిలీలు నిలిచిపోవడం వలన దాదాపు 2300 ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. భర్త ఒక జిల్లాలో భార్య మరో జిల్లాలో విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజూ 100 నుండి 300 కిలో మీటర్ల వరకు ప్రయాణం చేసి విధులకు హాజరు కావాల్సి వస్తుంది. చెరొక జిల్లలో పని చేయాల్సి రావడంతో ఈ ఉపాధ్యాయుల పిల్లలు, ఆరోగ్యం సరిగా లేని వృద్ధ తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. కుటుంబాన్ని వదిలి విడిగా ఉండలేక.. రోజూ దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉద్యోగం చేయాల్సి వస్తోందని తమ గోడును వెళ్లబోసుకున్నారు. దీంతో ఉపాధ్యాయులు తీవ్ర మానసిక, శారీరక వేదనకు గురౌతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబంతో మనశ్శాంతిగా ఉండలేక పోతున్నామంటున్నారు. దూర ప్రయాణం వలన అలసట.. బోధన సామర్థ్యం, నాణ్యతపై తీవ్ర ప్రభావం పడుతోందని పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆందోళనలో ఉపాధ్యాయ కుటుంబాలు
గడిచిన 5 నెలలుగా ఉపాధ్యాయుల కుటుంబాల్లో తీవ్రమైన మానసిక వేదన నెలకొని ఉంది. స్పౌజ్ బదిలీలకు ప్రభుత్వం వారు ఎప్పుడు అనుమతి ఇస్తారో అర్థంకాక అగమ్యగోచరమైన పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్నామంటున్నారు. కనీసం ఈ వేసవి సెలవులలోపు తమ సమస్య పరిష్కారం అవుతుందనే ఆశాభావంతో ఉన్నామంటున్నారు. సెలవులు మొదలైన నాటి నుండి ఉపాధ్యాయ సంఘాల నేతృత్వంలో.. ప్రజా ప్రతినిధులు, మంత్రుల చుట్టూ తిరిగినప్పటికీ.. సమస్యపై ఫలితం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సెలవులు ముగిసి జూన్ లో పాఠశాలలు తెరుచుకున్న తరువాత కూడా పిల్లలు తల్లిదండ్రులను వదిలి భార్యా భర్తలు చెరోజిల్లాలో విధులు నిర్వహించడం అనే ఆలోచన తమ కుటుంబాల్లో ఆందోళన రేకెత్తిస్తోందని అంటున్నారు స్పౌజ్ ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులు.
సీఎం పైనే ఆశలన్నీ..!
దంపతులైన ఉద్యోగులు ఒకే జిల్లాలో ఉంటేనే మంచి ఫలితాలు సాధించగలమని పలుమార్లు సీఎం చెప్పిన మాటలను ఉపాధ్యాయ దంపతులు గుర్తు చేశారు. ఈ సమస్యకు సీఎం మాత్రమే పరిష్కారం చూపగలరని ఆశభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ స్సౌజ్ ఫోరమ్ సభ్యులు వివేక్, నరేష్, ఖాదర్, త్రివేణి, అర్చన, మమత, జిల్లా బాధ్యులు గడ్డం కృష్ణ, బాలస్వామి, మహేష్, నరేష్, ప్రవీణ్, మల్లిఖార్జున్, చంద్రశేఖర్, దామోదర్, ప్రభాకర్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.