ఇందిరా పార్క్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. 317 జీవోను వ్యతిరేకిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మహాధర్నా నిర్వహించాయి. అయితే పోలీసులు అనుమతి లేదని అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. వందలాదిగా తరలివచ్చిన ఉద్యోగులతో ఇందిరాపార్క్ ప్రాంతం నిండిపోయింది. పోలీసులు చాలామందిని అదుపులోకి తీసుకున్నారు.
జీవోను సవరించే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు ఉద్యోగ, ఉపాధ్యాయులు. దశలవారీగా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. జీవోకు సవరణలు చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. రానున్న రోజుల్లో ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
తమ పట్ల ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాధర్నాను అడ్డుకునేందుకు ముందస్తు అరెస్ట్ లు కూడా జరిగాయని తెలిపారు. ప్రభుత్వం ఏం చేసినా తమ పోరాటం మాత్రం ఆగదని స్పష్టం చేశారు. ఇది ఆరంభం మాత్రమేనని.. సర్కార్ దిగిరాకపోతే ఉద్యమిస్తామని చెప్పారు.
స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వకపోతే భవిష్యత్ లో నాన్ లోకల్స్ గో బ్యాక్ అనే నినాదం బలపడే ప్రమాదం ఉందంటున్నారు ఉద్యోగులు. 317 జీవో వల్ల ఎంతోమంది తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.