ఏడాదిగా 13 జిల్లాల్లో ఉపాధ్యాయ బదిలీల కోసం ఎదురు చూస్తున్న స్పౌజ్ ఉపాధ్యాయలు నేడు మౌన దీక్షతో లక్డికాపూల్ లోని డీఎస్పీ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. వందలాదిగా తరలివచ్చిన ఉపాధ్యాయులు..మౌనంగా తమ ఆవేదనను ప్రభుత్వానికి వివరించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు టీచర్లతో పాటు వారి పిల్లలను కూడా అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.
ఇక గడిచిన ఏడాదిగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని, ప్రతి స్పౌజ్ బాధితుడికి న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగుతుందని ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. దంపతుల బదిలీలను బ్లాక్ చేసిన 13 జిల్లాల్లో 2100 మంది బాధితులుండగా, అందులో 615 మందికి మాత్రమే స్పౌజ్ బదిలీలు జరుగుతున్నాయని, అది కూడా కేవలం కొద్ది మంది స్కూల్ అసిస్టెంట్లకు మాత్రమే అనుమతించి, ఎస్జిటి,పండిట్, పీఈటి ఇతర ఉపాధ్యాయ దంపతుల బదిలీలు జరగడం లేదని విస్తృత ప్రచారం జరుగుతుంది.
మరో వైపు అసలేం జరుగుతుందో అర్థం కాక ఉపాధ్యాయ సంఘాల నాయకుల నుంచి సరైన సమాధానం దొరకక ఆందోళనతో ఉపాధ్యాయ దంపతులు డీఎస్పీ కార్యాయం ముందు మౌన దీక్ష చేపట్టారు. అయితే వారి పిల్లలు కూడా దీక్షలో పాల్గొనడం ఉద్రిక్తతకు దారి తీసింది. కమిషనర్ కార్యాలయం చేరుకుంటున్న ఉపాధ్యాయులను ఎక్కిడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ ఆందోళనలో చిన్నారులను సైతం పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బ్లాక్ లో ఉంచిన 13 జిల్లాల్లో 1656 మంది దంపతుల బదిలీలు నిర్వహించేందుకు ఫైలు సిద్ధమైందని సమాచారం ఉన్నప్పటికీ, 615 మందికి మాత్రమే చేయాలనుకోవడం బాధాకరమని ఉపాధ్యాయులు ఆవేదన చెందారు. 30 శాతం మందికే దంపతుల బదిలీలు చేప్టటి, పూర్తిగా అవకాశం ఉన్న క్యాడర్లను పక్కకు పెట్టడం స్పౌజ్ బదిలీల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలలో ఆవేదన మిగిల్చిందని ఉపాధ్యాయులు వాపోయారు. సంవత్సరం క్రితం 19 జిల్లాలకు ఇచ్చి 13 జిల్లాలను బ్లాక్ లో ఉంచి వివక్ష చూపారని ఉపాధ్యాయ దంపతులు బాధపడుతున్నారు.