బోర్డర్ గవాస్కర్ ట్రోఫిని భారత జట్టు కైవసం చేసుకుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1 తేడాది కప్ ను సొంతం చేసుకుంది. టెస్టు సిరీస్‌తో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. సొంత గడ్డపై టీమిండియాకు ఇది వరుసగా 16వ టెస్టు సిరీస్ విజయం. 2013 నుంచి స్వదేశంలో వరుసగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, శ్రీలంక, ఆఫ్గనిస్థాన్ జట్లపై సిరీసుల్లో విజయం సాధించింది.
2016 నుంచి 2023 వరకు ఆస్ట్రేలియాపై టీమిండియా జట్టు వరుసగా 4 టెస్టు సిరీస్ లు గెలిచింది. 30 ఏండ్లలో భారత్ ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2000 నుంచి స్వదేశంలో భారత జట్టు 39 టెస్టు సిరీస్‌లు ఆడింది. అందులో ఏకంగా 31 సిరీసుల్లో గెలుపొందింది.
మరోవైపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకోవడంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆనందం వ్యక్తం చేశారు. కఠిన పరిస్థితుల్లో భారత ఆటగాళ్లు పరుగులు చేయడంతో పాటు, కీలకమైన వికెట్లను పడగొట్టారన్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించడంతో విజయం సాధ్యమైందన్నారు.
ఈ సిరీస్ లో భారత జట్టులో కొత్త కుర్రాళ్లకు స్థానం లభించిందన్నారు. వారిలో చాలా మంది జట్టు విజయం కోసం చాలా శ్రమించారని అన్నారు. ఈ సిరీస్లో తమకు చాలా సవాళ్లు ఎదరయ్యాయని చెప్పారు. వాటన్నింటికి సమిష్టిగా ధీటుగా బదులిచ్చామని చెప్పారు.