చెన్నై టెస్టులో టీం ఇండియా పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ భారీగా, అలవోకగా పరుగులు చేసిన పిచ్ పై భారత బ్యాట్స్ మన్ పెవిలియన్ కు క్యూ కట్టారు. పెద్ద ప్లేయర్స్ అంతా ఒకరి తర్వాత ఒకరు ఔట్ అవటంతో భారత బ్యాటింగ్ వ్యవస్థ కుప్పకూలింది. ఫలితంగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 257పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఈ కాస్త పరుగులు కూడా రిషబ్ పంత్-పుజారా ద్వయం ఎదురుదాడి చేయటంతో సాధ్యమయ్యింది. పుజారా 73 పరుగులు, పంత్ 91 పరుగులతో పోరాడటంతో ఇండియా పరువు కాపాడుకుంది.
మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ను స్పిన్నర్ అశ్విన్ సెట్ కానివ్వలేదు. ఆట మొదలైన 40నిమిషాల్లోనే అలౌట్ చేశారు. 555ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించి 578పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియాకు వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. రోహిత్, గిల్, కోహ్లి, రహానే ఇలా అంతా క్యూ కట్టారు. పుజారా-పంత్ ద్వయం మాత్రమే పోరాడటంతో ఇండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 257-6 పరుగులు చేయగలిగింది.
క్రీజులో 33పరుగులతో నాటౌట్ గా వాషింగ్టన్ సుందర్, 8 పరుగులతో అశ్విన్ క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్ 2, డామ్ బెస్ 4వికెట్లు పడగొట్టారు. ఇటు భారత బౌలర్లలో ఇషాంత్ 2, బుమ్రా-అశ్విన్ 3, నదీమ్ 2వికెట్లు పడగొట్టారు.