లక్నో పిచ్ టీమిండియాకు ‘ఘోరం’ గా పరిణమించింది. భారత-న్యూజిలాండ్ మధ్య రెండో టీ 20 మ్యాచ్ లో ఈ పిచ్ భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు షాకిచ్చింది. కామెంటేటర్లు కూడా ఈ పిచ్ పై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆదివారం జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ టీమ్ 99 పరుగులు చేయగా 19.5 ఓవర్లలో ఈ టార్గెట్ ను ఛేదించి 100 పరుగులు చేయడానికి టీమిండియా నానా తంటాలు పడింది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి ఏకనా క్రికెట్ స్టేడియం పిచ్ పట్ల హార్దిక్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
ఇవేం పిచ్ లు.. చాలా ఘోరంగా ఉన్నాయి.. అని క్యురేటర్ పై నిప్పులు కక్కాడు. చివరి నిముషంలో క్యూరేటర్ సురేందర్ కుమార్ కి ఉద్వాసన చెప్పినట్టు తెలుస్తోంది. ఈ రెండో టీ 20 లో టీమిండియా కేవలం 100 పరుగులు చేయడానికి నానా తంటాలు పడిందంటే ఈ పిచ్ ని ‘షాకర్ పిచ్’ గా హార్దిక్ అభివర్ణించాల్సి వచ్చింది.
టీ 20 లకు ఏ మాత్రం సరిపోని పిచ్ ని ఇక్కడి క్యూరేటర్ తయారు చేశారని, తొలి మ్యాచ్ పిచ్ కూడా అలాగే ఉందని అన్నాడు. తాము ఆడబోయే స్టేడియం లలో పిచ్ లను చాలా ముందుగానే తయారు చేసేలా చూడాలని సూచించాడు.
సూర్యకుమార్ సైతం ఒక్కో రన్ కోసం ఎంతో శ్రమించాల్సి వచ్చిందన్నాడు . ఇక సురేందర్ కుమార్ స్థానే సంజీవ్ అగర్వాల్ ని కొత్త క్యూరేటర్ గా నియమించారు. ఎర్ర మట్టి పిచ్ వేయాలని మూడు రోజుల ముందే టీమ్ మేనేజ్మెంట్ సూచించిందని.. కానీ మొదటి క్యూరేటర్ నల్ల మట్టి పిచ్ తయారు చేశాడని తెలిసింది. చివరి నిముషంలో దీన్ని మార్చాలని కోరినా అది తగినట్టు ‘రూపు దిద్దుకోలేదని’ తెలుస్తోంది. ఇక మూడో టీ 20 బుధవారం అహ్మదాబాద్ లో జరగనుంది. ఇక్కడి పిచ్ ఎలా ఉంటుందో చూడాలి మరి !