తమిళనాడులో ఒక్క రూపాయికే ఇడ్లీ విక్రయిస్తూ 80 ఏళ్ల కమలాత్తాళ్ ‘ఇడ్లీ అమ్మ’గా అందరి దృష్టిని ఆకర్షించింది. కమలాథల్ గురించి రెండేళ్ల కిందట సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో విస్తృత కథనాలు వచ్చాయి. వాటిని చూసి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర ఆశ్చర్యపోయారు. అప్పట్లోనే ఆమెకు సాయమందించేందుకు ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆదివారం మాతృదినోత్సవం సందర్భంగా ఆనంద్ మహేంద్ర ‘ఇడ్లీ అమ్మ’కు అపూర్వమైన కానుక అందించారు.
గతంలో ప్రకటించినట్లుగా ఆమె కోసం తమిళనాడులోని ఆమె సొంత ప్రాంతంలో ఇల్లు నిర్మించి ఇచ్చారు. ఈ మేరకు మహీంద్రా కెంపెనీకి చెందిన వ్యక్తులు కొత్త ఇల్లుకు సంబంధించిన గృహ ప్రవేశ కార్మక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇడ్లీ అమ్మ కమలాత్తాళ్ రిబ్బన్ కట్ చేసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది.
ఈ విషయాన్ని ఆనంద్ మహీంద్ర తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ఇడ్లీ అమ్మకు ఈ చిన్న సాయం చేయడం సంతోషంగా ఉంది. అందరికి హ్యాపీ మదర్స్ డే’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అలాగే సకాలంలో ఇల్లు నిర్మాణాన్ని పూర్తి చేయించిన మహీంద్రా సంస్థ ఉద్యోగులను ఆయన అభినందించారు.
తమిళనాడులోని పడివెలంపాలయం గ్రామానికి చెందిన కమలాత్తాళ్ 37 ఏళ్లుగా ఇడ్లీలు అమ్ముతూ పేదల ఆకలి తీరుస్తోంది. ఒక్క రూపాయికే ప్లేట్ ఇడ్లీలు ఇస్తూ ఈ బామ్మ వార్తల్లో కెక్కింది. ఈ క్రమంలోనే బామ్మ విషయం ఆనంద్ మహీంద్రా దాకా వెళ్లింది. ఈ క్రమంలో 2019లోనే త్వరలోనే బామ్మకు ఇల్లు నిర్మించబోతున్నట్లు అప్పట్లోనే ప్రకటించారు. అన్నట్టుగానే పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చారు.