రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్తున్న ఇండిగో విమానానికి సాంకేతిక లోపం తలెత్తింది. తిరుపతిలో దిగాల్సిన సమయంలో గాలిలో ఊగిపోయింది. దీంతో ల్యాండింగ్ కష్టమని భావించి… కాసేపటి తర్వాత విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు అధికారులు.
తిరుపతి ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ సాధ్యం కాక గంట సమయం గాలిలోనే చక్కర్లు కొట్టింది ఫ్లైట్. సాంకేతిక కారణాలతో విమానాన్ని బెంగళూరు తరలించినా.. అక్కడ ల్యాండ్ అయిన తర్వాత డోర్లు తెరుచుకోలేదు. ఇదే విమానంలో రోజాతోపాటు మాజీ మంత్రి యనమల ఉన్నారు. అసలు సమస్య ఏంటో సిబ్బంది స్పష్టత ఇవ్వలేదన్నారు యనమల. ఇండిగో సిబ్బంది సమాధానంపై ప్రయాణికుల అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఫ్లైట్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయాణికుల నుంచి అదనపు రుసుము డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. యాజమాన్యం తప్పిదానికి తామెందుకు డబ్బులు కట్టాలని ప్రయాణికుల ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. బెంగుళూరు నుంచి సొంత ఖర్చులతోనే ప్రయాణికులు గమ్య స్థానాలకు చేరారు.