2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యాన్ని సాధించేందుకు భారత్‌కు సాంకేతికత తోడ్పడుతుందని ప్రధాని మోడీ అన్నారు. సాంకేతికత, అందరికీ సమాన అవకాశాలను కల్పించేందుకు 2023 కేంద్ర బడ్జెట్ ప్రాధాన్యత ఇచ్చిందన్నారు.
‘అన్‌లీషింగ్ ది పొటెన్షియల్: ఈజ్ ఆఫ్ లివింగ్ యూజింగ్ టెక్నాలజీ’అనే వెబ్‌నార్ ను మంగళవారం నిర్వహించారు. కేంద్ర బడ్జెట్ 2023లో ప్రకటించిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు సలహాలు, సూచనలను కోరేందుకు ప్రభుత్వం వెబినార్స్ నిర్వహిస్తోంది.
బడ్జెట్ అనంతరం నిర్వహించిన వెబ్ నార్లలో ఇది ఐదవది. ఈ వెబ్ నార్‌లో ప్రధాని మోడీ మాట్లాడుతూ… సాంకేతికత అనేది అందరికి సమానమైన అవకాశాలను కల్పిస్తోందన్నారు. ప్రభుత్వం కూడా అదే దిశలో భారీగా పెట్టుబడులు పెడుతోందని ఆయన పేర్కొన్నారు.
ఆధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలను సృష్టించడంతో పాటు, వాటి ప్రయోజనాలు అందరికీ సమానంగా అందేలా ప్రభుత్వం భరోసా ఇస్తోందన్నారు. దీనితో పాటు, డిజిటల్ విప్లవ ప్రయోజనాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరేలా వారు భరోసా ఇస్తున్నామన్నారు.
నేడు గవర్నమెంట్ ఇ మార్కెట్‌ప్లేస్ పోర్టల్ ఈ అవకాశాన్ని సుదూర ప్రాంతాల నుండి వచ్చిన చిన్న దుకాణదారులు, వీధి వ్యాపారులకు కూడా వారి ఉత్పత్తులను నేరుగా ప్రభుత్వానికి విక్రయించేందుకు అవకాశం కల్పించిందన్నారు. ఇ-నామ్ (నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్) రైతులకు వివిధ ప్రాంతాల నుండి కొనుగోలుదారులతో కనెక్ట్ అయ్యే అవకాశాన్ని అందించిందన్నారు. ఇప్పుడు రైతులు ఒకే చోట ఉంటూనే తమ ఉత్పత్తులకు ఉత్తమమైన ధరను పొందవచ్చన్నారు.