తప్పుడు డాక్యుమెంట్లతో ఇండియాలో ప్రవేశించి బెంగుళూరులో నివాసం ఉంటున్న పాకిస్తానీ యువతినొకరిని పోలీసులు అరెస్టు చేశారు. 19 ఏళ్ళ ఇక్రా జీవానీ అనే ఈమె కథలోకి వెళ్తే.. పాక్ లో సింధ్ ప్రావిన్స్ లోని హైదరాబాద్ కు చెందిన ఈమెకు, ఇండియాలో ఉత్తరప్రదేశ్ కి చెందిన ములాయం సింగ్ యాదవ్ అనే 26 ఏళ్ళ యువకుడికి మధ్య గేమింగ్ యాప్ ‘లుడో’ ద్వారా పరిచయం ఏర్పడింది. ములాయం సింగ్ యూపీలో ఓ ప్రైవేటు సంస్థలో సెక్యూరిటీగా పని చేస్తున్నాడు. గత ఏడాది వీరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా పెళ్లి వరకు వెళ్ళింది. ఇక ‘సినిమా’ మొదలయింది.
ములాయం తన ప్రేయసిని భారత్-నేపాల్ బోర్డర్ ద్వారా ఇండియాకు రప్పించాలనుకుని కొన్ని నెలల క్రితం తాను నేపాల్ వెళ్ళాడు. అక్కడే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక అక్కడ మాత్రం ఎంతకాలం ఉంటారు ? ఇద్దరూ ఇండో-నేపాల్ సరిహద్దు దాటి మొదట బీహార్ లోని బీర్ గంజ్ చేరుకొని..తరువాత అక్కడి నుంచి పాట్నాకు వచ్చారు. ఇక్కడ కూడా పొసగనట్టుంది..
కొంతకాలానికి ఇద్దరూ బెంగుళూరు చేరుకున్నారు. ఇక్కడ ఉంటూనే తన భార్య ఇక్రా జీవానీ పేరును ..ములాయం.. ‘రావా యాదవ్’ గా మార్చి ఆధార్ కార్డు తీసుకున్నాడు. పైగా ఇండియన్ పాస్ పోర్టు కోసం కూడా దరఖాస్తు చేశాడు. అయితే మెల్లగా కథ అడ్డం తిరిగింది. ఇక్రా జీవానీ .. పాకిస్తాన్ లోని తన కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయడానికి యత్నిస్తు వచ్చింది.
దీన్ని నిఘా సంస్థలు పసిగట్టి రాష్ట్ర ఇంటెలిజెన్స్ ని అప్రమత్తం చేయడంతో పోలీసులు వీరి ఇంటిపై దాడి చేశారు. ఇక్రాను , ములాయం సింగ్ యాదవ్ ని అరెస్టు చేశారు. తప్పుడు డాక్యుమెంట్లతో ఇక్రా వచ్చినట్టు నిర్ధారణ కావడంతో ఆమెను మహిళా స్టేట్ హోమ్ కి తరలించారు. పాకిస్తాన్ కు చెందిన ఈమె గూఢచర్యం కోసం ఇండియాకు వచ్చిందా అన్న కోణంలోనూ విచారిస్తున్నారు.