ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న బీజేపీ గూటికి చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఆయనకు పార్టీ కండువా కప్పి.. సభ్యత్వాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మల్లన్న… తాను తీసుకుంది సభ్యత్వ రసీదు కాదని.. 15 మీటర్ల తాడని చెప్పారు. దాంతో తెలంగాణ అమరవీరుల స్థూపానికి కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావును కట్టేస్తానన్నారు. అమరవీరుల తల్లిదండ్రులను పిలిచి కొరడాతో కొట్టిస్తానని చెప్పారు. తనపై 38 కేసులు పెట్టారని.. అయినా ఏం సాధించారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఉద్యమకారులంతా ఒక్కటవుతున్నారన్న మల్లన్న… ప్రజల్లోకి వెళ్లి కేసీఆర్ పై పోరాడతామని తెలిపారు. “సీఎం కేసీఆర్ ప్రపంచంలోనే అత్యంత మోసకారి. తెలంగాణలో మీడియాను 100 కి.మీ లోతున పాతిపెడతానని చెప్పిన అహంభావి. అంతకంటే లోతున నిన్ను పాతిపెట్టే రోజులు వస్తాయని ప్రశ్నించిన తొలిగొంతు నాది. నాటి నుండి ఆ దిశగా పనిచేస్తున్న. అందుకే బీజేపీ ఇస్తున్న ఈ తాడుతో అమరవీరుల స్తూపానికి కట్టేసి కేసీఆర్ కుటుంబం వీపు పగలకొట్టిస్తా” అని అన్నారు.
తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు బండి సంజయ్. పదవులు, సీట్ల కోసం ఆయన చేరలేదని… కేవలం టీఆర్‌ఎస్ పార్టీని తెలంగాణలో అంతమొందించేందుకు వచ్చారని తెలిపారు. ప్రజల కోసం మల్లన్న పోరాటం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
ఇక తరుణ్ చుగ్ మాట్లాడుతూ… ప్రజా సమస్యలపై బీజేపీ నిరంతరం పోరాడుతుందని చెప్పారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను మల్లన్న నిరంతరం ప్రశ్నిస్తున్నారని.. అందుకే అక్రమంగా కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో జరుగుతున్న అక్రమాలన్నీ ఢిల్లీ వరకు వినిపిస్తున్నాయని చెప్పుకొచ్చారు తరుణ్ చుగ్.