క్యూ న్యూస్ నిర్వాహకుడు మల్లన్న అరెస్ట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. అతను ఎక్కడున్నాడో ఎవరికీ తెలియడం లేదు. ఈ క్రమంలో తన భర్త ఆచూకీ తెలపాలని మల్లన్న భార్య మమత మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. లాయర్, కుటుంబసభ్యులతో కలిసి పోలీసులను వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసింది. తన భర్త అరెస్టుకు ముందు నమోదైన ఎఫ్ఐఆర్ ను కూడా ఇవ్వలేదని ఆరోపించింది.
మంగళవారం రాత్రి.. క్యూ న్యూస్ ఆఫీసులో సోదాలు చేశారు పోలీసులు. అక్కడి కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్ లను పరిశీలించారు. కొన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. ఒక్కసారిగా పోలీసులు రావడంతో క్యూ న్యూస్ ఆఫీస్ దగ్గర నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈక్రమంలోనే మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. ఏ కేసులో అరెస్ట్ చేశారన్నది మాత్రం స్పష్టం చెయ్యలేదు.
మల్లన్నతోపాటు తెలంగాణ విఠల్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విఠల్, మల్లన్న కుటుంబాలను పరామర్శించారు. వారిని వెంటనే విడుదల చేయాలని.. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ ఉద్యమకారులారా, ఇప్పటికైనా బయటకురండి.. కేసీఆర్ కుటుంబ పాలనపై పోరాడుదామని పిలుపునిచ్చారు.
మరోవైపు మల్లన్న అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అరెస్ట్ చేశారు? ఎక్కడున్నాడో వివరాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.