జీయర్ ఓ భూబకాసురుడు! - తీన్మార్ మల్లన్న - Tolivelugu

జీయర్ ఓ భూబకాసురుడు! – తీన్మార్ మల్లన్న

తెలంగాణాలో ఆధ్యాత్మికతకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న చిన్న జీయర్ స్వామిపై ఆరోపణలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో తన ఆశ్రమం ఒక పవర్ సెంటర్‌గా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది నిజమేనా? ఇది అనేక అక్రమాలకు అడ్డాగా మారిందా? అని భక్తులు ఒక కన్ఫ్యూషన్‌లో వున్నారు. తన ప్రియ శిష్యుడు మైహోమ్ రామేశ్వరరావు డీల్ చేస్తే, జీయర్ సీఎం కేసీఆర్‌తో పనిచేయిస్తారు అనే వదంతులు చక్కర్లు కొడుతూనే వున్నాయి. ఇది తగ్గకపోగా రోజూ ఏదో ఒక కొత్త ఇరకాటంలో జీయర్ తను పడిపోతూ, కేసీఆర్‌కు కూడా కష్టాలు ప్రసాదంగా పంచుతున్నారా… అని అనిపిస్తోంది.

ఇలాంటి టైమ్‌లో న్యూస్ టీవీలలో మల్లన్నగా తెలంగాణాలో ప్రజాదరణ పొందిన జర్నలిస్ట్ నవీన్, తన పేరున ఒక యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టి ప్రభుత్వ అక్రమాలు ఇదిగో అంటూ వారానికి ఒక కొత్త కాంట్రవర్సీతో ప్రజల ముందుకు వస్తున్నారు. ఈరోజు చేసిన లైవ్‌లో తెలంగాణ భూములు మైహోమ్, స్వామిజీల పాలవుతున్నాయి అని ఆరోపిస్తున్నారు మల్లన్న. యాదగిరిగుట్ట కింద 10 కోట్లకు పైగా విలువ చేసే భూమిని కేవలం 16 లక్షలకే దొర గారు తన గురువు చినజీయర్ స్వామికి ధారాదత్తం చేశారన్నారు. అది కూడా చాలా గోప్యంగా రిజిస్టేషన్ కూడా కానిచ్చేశారట. భూమి చిన్న జీయర్ పేరు మీద రిజిస్టేషన్ అయితే ఆయన మాత్రం రిజిస్టేషన్ ఆఫీస్‌కు రాలేదు. మైహోమ్ రామేశ్వరరావు అత్యంత సన్నిహితుడు వెంకట్‌రావు వచ్చి ఆఘమేఘాలమీద 2 ఎకరాల 30 గుంటల భూమిని స్వామీజీ ట్రస్ట్ పేరు మీద రిజిస్టేషన్ చేయించుకొని వెళ్లారు అంటూ మల్లన్న ఆధారాలు కూడా చూపించారు. శారదా పీఠానికి భూమి ఇస్తే బయటకు చెప్పిన కేసీఆర్, మరి చిన్నజీయర్‌కు భూములు ఇస్తే ఎందుకు చెప్పలేదు ? అంత గోప్యంగా ఎందుకు ఉంచారు ? అనేది ప్రభుత్వ పెద్దలు చెప్పాలని మల్లన్న తన అనుమానాలు వ్యక్తపరిచారు.

తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో డాక్యూమెంట్లు బయటపెడుతున్న మల్లన్న.. ఈసారి జీయర్ ట్రస్టుకి ఎన్ని భూములు ప్రభుత్వం ధారపోస్తోందో ఏకరువు పెట్టారు. దళితులకు మూడు ఎకరాల ఇస్తామని చెప్పిన కేసీఆర్ భూమి దొరకడం లేదని తప్పించుకుంటూ, అదే దళితుల నుంచి యాదగిరిగుట్ట అభివృద్ధి కోసమని చెప్పి భూమి తీసుకొని మైహోమ్, చిన్నజీయర్‌కు ధారాదత్తం చేయడంపై మల్లన్న తన ఆక్రోశం వెళ్లబుచ్చారు. ఆ వీడియోని చూసిన ప్రజలనుంచి విపరీతమయిన ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

అక్కడితో ఆగని మల్లన్న, అసలు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి, పైగా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన చిన్నజీయర్‌కు తెలంగాణ ప్రజల అస్తిని ఎలా పంచి పెడతారు అని సూటిగా ప్రశ్నించారు. చిన్నజీయర్‌కు ఇచ్చిన భూమిని వేలం వేస్తే 10 కోట్లకు పైగా డబ్బులు వచ్చేవి, వాటితో ఎంతోమంది పేదలకు మూడెకరాల పొలం కొని ఇవ్వొచ్చు, కానీ పేదల సొమ్మును పెద్దల పాలు చేస్తున్నాడు ఈ కేసీఆర్.. అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఆ ఆరోపణల్లో నిజాలు బయటపెట్టె పనిలో నేనున్నా అని మల్లన్న చెప్పారు.

ఒక పక్క ఆర్థిక మాంద్యం ఉంది అని బడ్జెట్‌లో సంక్షేమానికి కోతలు పెట్టిన కేసీఆర్ కోట్ల విలువ చేసే ఆస్తులను మాత్రం ఆప్తులకు దారపోస్తున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి గుడిలో స్తంభాలపై కేసీఆర్ బొమ్మలు చెక్కడంతో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుంటే దాన్ని అవకాశంగా తీసుకొని అందరి ఫోకస్ అటు వైపు ఉందని ఆలోచించి మైహోమ్ రామేశ్వరరావు తన మనుషులతో పనికానిచ్చేశారని మల్లన్న చేసిన ఆరోపణలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది.
ఒక పక్క మల్లన్న డాక్యుమెంట్లతో సహా నిజాలు బయటపెడుతున్నా… ప్రభుత్వం కానీ, ప్రతిపక్షం కానీ మిన్నకుండా ఉండడం చాలా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జీయర్ తన ఆత్మీయ శిష్యుడైన మైహోమ్ రామేశ్వరరావుతో రాష్ట్రంలో షాడో సీఎంగా పనిచేస్తున్నారన్న వదంతులు ఊపందుకుంటున్న సమయంలో, మల్లన్న చేస్తున్న ఈ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అటు సర్కారు పైన, ఇటు జీయర్‌స్వామి పైనా ఎంతైనా వుంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp