బారీ వర్షాలు, వరదలకు కాళేశ్వరం లోపాలు బయటపడ్డాయి. పంప్ హౌస్ ల మునక, ప్రాజెక్టు కాంక్రీట్ గ్రావిటీ లైనింగ్ ధ్వంసం.. ఇలా అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి. గ్రావిటీ కెనాల్ 6వ కిలోమీటర్ వద్ద 50 మీటర్ల మేర దెబ్బతింది. అయితే.. ఆ పరిసర ప్రాంతాల్లోకి మీడియాను గానీ, రాజకీయ నాయకులను గానీ.. ఎవరినీ అనుమతించడం లేదు. అయితే.. తీన్మార్ మల్లన్న కాళేశ్వరం వెళ్లేందుకు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది.
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని నీట మునిగిన కన్నెపల్లి లక్ష్మి పంప్ హౌస్ ను విజిట్ చేయడానికి వెళ్లారు మల్లన్న. ఈ క్రమంలో ఆయన్ను కన్నెపల్లి వెళ్లకుండా మహాదేవపూర్ లో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు పోలీసులు, మల్లన్న మధ్య వాగ్వాదం నడించింది.
తాను కన్నెపల్లి వెళ్లడం లేదని.. దేవుడి దర్శనానికి కాళేశ్వరం వెళుతున్నానని చెప్పారు. అయినా పోలీసులు వినిపించుకోలేదు. మల్లన్నను బలవంతంగా వాహనం నుండి దించి పోలీస్ స్టేషన్ తరలించారు.
మల్లన్న అరెస్ట్ సందర్భంగా తీవ్ర గందరగోళం, తోపులాట జరిగాయి. ‘దేవుని దర్శనానికి వెళ్తున్న తనను ఆపి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లడం చాలా అన్యాయమని మండిపడ్డారు మల్లన్న.