తేజ పుట్టినరోజు సందర్భంగా ఒకేసారి 2 సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ వచ్చాయి. వీటిలో ఒకటి అహింస. ఈ సినిమాలో సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా నటిస్తున్నాడు. ఇక తేజ నుంచి మరో సినిమా అప్ డేట్ కూడా వచ్చింది. దాని పేరు విక్రమాదిత్య. మరి ఈ సినిమాలో హీరో ఎవరు?
నిన్న విక్రమాదిత్యను అఫీషియల్ గా లాంఛ్ చేశారు. సెంటిమెంట్ ప్రకారం.. 22-2-2022 తేదీన మధ్యాహ్నం 2 గంటల 22 నిమిషాలకు ఫస్ట్ షాట్ తీశారు. పనిలోపనిగా ప్రీ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో రైలు బండి పొగలో హీరోహీరోయిన్లు రొమాన్స్ చేసుకుంటున్న ఫొటోను వదిలారు. ఆ హీరో మరెవరో కాదు, దర్శకుడు తేజ కొడుకు అమితవ్ తేజ్.
అవును.. తన కొడుకును హీరోగా పరిచయం చేస్తూ విక్రమాదిత్య సినిమాను లాంచ్ చేశాడు తేజ. కాకపోతే ఆ విషయాన్ని ఎక్కడా బయటపెట్టలేదు. మరో మంచి రోజు చూసి అమితవ్ తేజ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తారు. మొత్తానికి తేజ ఒక్కసారిగా బిజీ అయిపోయాడు. ఓవైపు సురేష్ బాబు కొడుకును పరిచయం చేసే బాధ్యతను నిర్వర్తిస్తూనే, ఇప్పుడు తన కొడుకును వెండితెరకు పరిచయం చేసే మరో కీలక బాధ్యతను కూడా తనే మోయబోతున్నాడు
అన్నట్టు విక్రమాదిత్య సినిమా, దర్శకుడు తేజకు డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ కథను దాదాపు 20 ఏళ్ల కిందటే రాసుకున్నాడట తేజ. ఇప్పుడు కొడుకు కోసం తెరపైకి తీసుకొస్తున్నాడు. తేజ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రం ఇది.