రాష్ట్రంలో కుల గణన హామీని నెరవేర్చే విషయంలో జాప్యం జరిగేలా సీఎం నితీశ్ కుమార్ వ్యూహాలు అనుసరిస్తున్నారని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో కుల గణన ప్రక్రియను 72 గంటల్లోగా ప్రారంభించాలని అల్టిమేటం ఇచ్చారు.
ఈ విషయంలో తాను సీఎం నితీశ్ కుమార్ ను కలవాలని అనుకుంటున్నట్టు తెలిపారు. సీఎం తనకు అపాయింట్ మెంట్ ఇస్తారో లేదో ఇప్పుడే చెప్పలేనన్నారు. అపాయింట్ మెంట్ విషయంలో సీఎం నిర్ణయం అనంతరం తమ కార్యాచరణను అమలు చేస్తామన్నారు.
రాబోయే 72 గంటల్లో తాను సీఎంను కలవాలని అనుకుంటున్నట్టు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నుండి అపాయింట్‌మెంట్ కోరానని పేర్కొన్నారు.
ఒకవేళ తనను కలవడానికి సీఎం నిరాకరించినా లేదా ఈ విషయంలో తన నిస్సహాయతను ప్రదర్శించినా ప్రతిపక్షాలు తదనుగుణంగా భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తుందన్నారు.
కుల గణన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బీహార్ నుంచి ఢిల్లీకి పాదయాత్ర తప్ప మరో మార్గం లేదని నేను ఇప్పటికే చెప్పానని యాదవ్ అన్నారు.