కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కాశ్మీరీ పండిట్ల అఘాయిత్యాలను బీజేపీ రాజకీయం చేసింది.. వారి విషాదంపై సినిమాలు తీసి డబ్బు సంపాదిస్తోందన్న కామెంట్స్ పై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నారు. ఢిల్లీలోని సివిల్ లైన్స్ లోని కేజ్రీవాల్ ఇంటి ముందు నిరసనకు దిగారు.
బీజేపీ ఎంపీ, యువ మోర్చా అధ్యక్షుడు తేజశ్వీ సూర్య ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం జరిగింది. కేజ్రీవాల్ ఇంటి ముందు ఉన్న బారికేడ్లను తొలగించి ఆందోళనలు చేపట్టారు బీజేపీ కార్యకర్తలు. సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. దాదాపు 70 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే.. ఇది పోలీసుల వైఫల్యం అంటూ ఆప్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ నేతలకు ఖాకీలు సహకరించారని ఆరోపించారు. ఢిల్లీ పోలీసులు విధ్వంసం, హింసను సులభతరం చేశారని విమర్శించారు. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా స్పందిస్తూ.. పంజాబ్ లో ఆప్ విజయాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని అన్నారు. కేజ్రీవాల్ పై హత్యాయత్నం చేస్తున్నారని.. ఆయన్ను టచ్ చేయాలని చూస్తే దేశం సహించదని హెచ్చరించారు.
మరోవైపు.. దేశంలోని హిందువులను అవమానించినందుకు కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు. ఆయన సారీ చెప్పే దాకా బీజేపీ యువమోర్చా వదిలి పెట్టదని తేజశ్వీ సూర్య అన్నారు.