‘రామచరిత్ మానస్’ పై తమ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సమంజసమేనని బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సమర్థించారు. అసలు ఈ వివాదానికి కారణం బీజేపీయేనని, ఇదంతా ఆ పార్టీ కుట్ర అని ఆయన ఆరోపించారు. చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపి హిందూ-ముస్లిముల మధ్య విద్వేషం పెంచేందుకు , రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆయన అన్నారు.
సీఎం నితీష్ కుమార్ ని అప్రదిష్ట పాల్జేసేందుకు ఆ పార్టీ నేతలు ఎంతకైనా తెగిస్తున్నారని యాదవ్ మండిపడ్డారు. రామాయణానికి సంబంధించిన ‘రామచరిత్ మానస్’.. సామాజిక వివక్షను ప్రోత్సహిస్తోందని, సమాజంలో ద్వేషానికి కారణమవుతోందని ఆర్జేడీకి చెందిన మంత్రి చంద్రశేఖర్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఆర్ఎస్ఎస్ సభ్యుడు ఎం.ఎస్. గోవల్కర్ రాసిన ‘బంచ్ ఆఫ్ థాట్స్’అనే పుస్తకంతో రామాయణాన్ని పోల్చారు. నిమ్న జాతులవారు విద్యావంతులైతే సమాజం విషతుల్యమవుతుందని రామచరిత్ మానస్ చెబుతోందని, దీనితో బాటు మనుస్మృతి వంటివి సామాజిక వివక్షను ప్రోత్సహిస్తున్నాయని ఆయన విమర్శించారు.
దీనిపై పెద్దఎత్తున వివాదం రేగినప్పటికీ ఆయన తన కామెంట్ కి కట్టుబడే ఉన్నారు. బీజేపీ వంటి పార్టీలు లేనిపోని వివాదాలు సృష్టిస్తే అందుకు తాను కారణం కాదన్నారు.