తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు భేటీ కాబోతున్నాయి. కరోనా వైరస్ చికిత్సలో ప్రైవేటు ఆసుపత్రులపై వరుసగా ఫిర్యాదులు వస్తుండటం, హైకోర్టు కూడా ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశిస్తున్న నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల యాజమన్యాలు అత్యవసరంగా మంత్రితో భేటీ కాబోతుండటం చర్చనీయాంశం అవుతోంది.

ఇప్పటికే రాష్ట్రంలో రెండు ఆసుపత్రులపై చర్యలు తీసుకోగా… మరికొన్ని ఆసుపత్రులకు నోటీసులు వెళ్లాయి. కొన్ని ఆసుపత్రులైతే ప్రభుత్వ నోటీసులకు సమాధానాలు కూడా చెప్పలేదు. ప్రభుత్వం కూడా 50శాతం బెడ్స్ ను స్వాధీన పర్చుకుంటామంటూ హెచ్చరించినా ప్రైవేటు దోపిడీ తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. దీంతో ఆసుపత్రి ముందు దేనికి ఎంత ఖర్చు చేస్తారన్నది లిస్ట్ పెట్టాలని, ఫైనల్ బిల్లు సమయంలోనూ వివరంగా ఇవ్వాలని ప్రభుత్వం ఆసుపత్రులను ఆదేశించింది.
ప్రభుత్వం నుండి, ప్రజల నుండి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో ఆసుపత్రుల ఓనర్లు మంత్రిని కలవబోతున్నారు. గతంలో ప్రైవేటు ఆసుపత్రులకు కరోనా చికిత్సకు పర్మిషన్ ఇచ్చిన కొత్తలో కూడా ప్రభుత్వం రేట్లు గిట్టుబాటు కావు అంటూ యాజమాన్యాలు మంత్రిని కలిశాయి. ఆ తర్వాతే అధికారులు ఆసుపత్రుల ఫీజులుంపై చూసిచూడనట్లు వ్యవహరించారు అన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వంతో ఆసుపత్రులు చర్చలు మొదలుపెట్టడంపై ఆసక్తి నెలకొంది.