తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తున్నాయి. ఈ ప్రభావంతో హైదరాబాద్ లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. గ్రేటర్ పరిధిలో మంగళవారం రాత్రి నుంచి ఏరియాలు మారుతూ వర్షం కురుస్తోంది.
నాంపల్లి, బషీర్ బాగ్, అబిడ్స్, కోటి, అంబేర్ పేట్, బేగంబజార్, కొండాపూర్, మాదాపూర్, మియాపూర్, చందానగర్ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా వర్షం కురవడంతో వరద నీరు ఇళ్లలోకి చేరింది.
పాతబస్తీలో వర్షాల వల్ల ముంపు ప్రాంతాల్లోని ఇళ్లను వరద నీరు ముంచెత్తింది. బుధవారం ఉదయం కురిసిన వర్షం కారణంగా చంద్రాయణ గుట్ట ప్రాంతంలో భారీగా వరద నీరు చేరడంతో వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.
తెలంగాణలో మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడ్రోజులు గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని స్పష్టం చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు 2 నుంచి 3 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు వెళతాయని పేర్కొంది వాతావరణశాఖ.