– పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు
– రాష్ట్రవ్యాప్తంగా 2,861 కేంద్రాలు
– రెండేళ్ల తర్వాత ఎగ్జామ్స్ నిర్వహణ
– 5 నిమిషాలు ఆలస్యమైతే నో ఎంట్రీ
– అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూంల ఏర్పాటు
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర ఏర్పాట్లు చేశారు. కొవిడ్ మహమ్మారి కారణంగా రెండేళ్లుగా టెన్త్ పరీక్షలు జరగలేదు. 2020లో కరోనా మొదటి వేవ్ వలన పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం..2021లోనూ కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. రెండేళ్ల తర్వాత ఇప్పుడే పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆయా పరీక్షా కేంద్రాలను సందర్శించి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ శాఖ కానిస్టేబుల్స్, హోంగార్డులను నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా 11,401 స్కూల్స్ కు చెందిన 5.09 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.
కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయనున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో పెట్టారు. పేపర్ లీకేజీకి ఆస్కారం లేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎస్సెస్సీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా ఎస్సెస్సీ బోర్డు అధికారులు హెచ్చరించారు. పదో తరగతి విద్యార్థులకు టీఎస్ఆర్టీసీ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. పదో తరగతి విద్యార్థినీ విద్యార్థులు బస్ పాస్ కలిగి ఉండి దానితో పాటు పరీక్ష హాల్ టికెట్ చూపిస్తే పరీక్షా కేంద్రానికి, కేంద్రం నుంచి తిరుగు ప్రయాణం ఉచితంగా పొందొచ్చని ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు.
సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థినీ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సమయపాలన పాటిస్తూ, అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,861 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. 9.35 తర్వాత పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించబోరు. 5 నిమిషాలు ఆలస్యమైతే పరీక్షా కేంద్రంలోకి ఎంట్రీ ఉండబోదు. ఈ నేపథ్యంలో విద్యార్థులు తప్పనిసరిగా సమయ పాలన పాటించాల్సి ఉంటుంది. విద్యాశాఖ అధికారులు అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూంలనూ ఏర్పాటు చేశారు.