తమ సమస్యల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు విన్నవించుకునేందుకు పాల్వంచ నుండి ప్రగతి భవన్ వరకు తెలంగాణ ఉద్యమ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పలువురు ఉద్యమకారులు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన పది మంది ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈ క్రమంలో పాదయాత్రకు పర్మిషన్ లేదంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి మండలం, రోల్లపాడు వద్ద తెలంగాణ ఉద్యమ ఐక్యవేదిక నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
టేకులపల్లి మండలం, రోలపాడు స్టేజి వద్ద ఇల్లందు, టేకులపల్లి పోలీసులు పాదయాత్రగా వచ్చే నాయకులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఐక్యవేదిక నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. అనంతరం ఐక్యవేదిక నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఉద్యమకారుల డిమాండ్స్:
-ప్రత్యేక తెలంగాణ కోసం ఏర్పడ్డ టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా మోస్తూ రాష్ట్రం ఏర్పాటు కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొని, పోలీసు నిర్భంధాలు, లాటీ చార్జీలతోపాటు జైళ్ళకు సైతం వెళ్ళిన మేమందరం ఆర్ధికంగా, సామాజికంగా పూర్తిగా చితికిపోయి ఉన్నాం. కావున మాకు సామాజికంగా, ఆర్ధికంగా సహాయంచేసి ప్రభుత్వం ఆదుకోవాలని ఫ్లెక్సీలను ప్రదర్శించారు.
-నాటి ఉద్యమకారులకు ఇంటి స్థలంతోపాటు ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాలని, ఉపాధి కోల్పోయి ఆర్ధికంగా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న మాకు ఉపాధి అవకాశాల కోసం ఆర్ధిక సహాయం చేయాలని కోరుతున్నారు.
-తెలంగాణ ఉద్యమకారులకు ప్రతి నెల కనీసం రూ.10వేల రూపాయల పెన్షన్ అమరవీరుల కుటుంబానికి నెలకు రూ.20వేలు ఇవ్వాలని కోరుతున్నారు.
-తెలంగాణ ఉద్యమకారులందరికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు, రైళ్ళలో ఉచిత ప్రయాణ అవకాశాన్ని కల్పించాలని తమ డిమాండ్ లో పేర్కొన్నారు.
-తెలంగాణ ఉద్యమకారులందరికీ వైద్య సౌకర్యాలతో పాటు ఉద్యమకారుల పిల్లలకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్ మెంట్మంజూరు చేయాలని, నిరుద్యోగులైన ఉద్యమకారుల పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.