తెలంగాణలో ఎండలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉమ్మడి జిల్లాల పరంగా చూస్తే 5 జిల్లాల పరిధిలో ఎండలు, ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మంగళవారం రాష్ట్రంలో 38.8 నుంచి 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా కొమురంభీఈం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఉత్తర దిశనుంచి అతి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు కాలంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, మే నెలలో 47 నుంచి 49 డిగ్రీలకు చేరుతుందని హీట్వేవ్ రిపోర్టులో హెచ్చరించారు. ఖమ్మం, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, వడదెబ్బ మరణాలు పెరుగుతాయని హెచ్చరించారు.
రాష్ట్రంలో 589 మండలాలుంటే 568 మండలాల్లో వడగాల్పులు ఎక్కువగా ఉండనుండగా, 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే ఛాన్స్75 శాతం ఉందని, 47 డిగ్రీల వరకు వడగాల్పులు వీచే అవకాశం 100 శాతం ఉందని రిపోర్ట్ హెచ్చరించింది.
దక్షిణ తెలంగాణలో కనీసం 8 నెలల కరువుకు అవకాశం ఉందని తెలిపింది.