కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం నిర్వహించాలనుకున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదాపడింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థన మేరకు భేటీని వాయిదా వేసినట్టు కేంద్ర జలవనరుల శాఖ ప్రకటించింది. తిరిగి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎప్పుడు నిర్వహించబోయేది ఇరు రాష్టాలకు సమాచారం ఇస్తామని ఆ శాఖ తెలిపింది.
వాస్తవానికి అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని బుధవారం ( నేడు) నిర్వహించబోతున్నట్టు కేంద్ర జలవనరుల శాఖ వారం రోజుల క్రితమే ప్రతిపాదించింది. అయితే సీఎం కేసీఆర్‌కు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటంతో సమావేశానికి హాజరు కావడం సాధ్యం కాదని.. తెలంగాణ సీఎస్ కేంద్ర జలవనరుల శాఖకు ఇటీవలే లేఖ రాశారు. భేటీని మరికొద్ది రోజుల పాటు వాయిదా వేయాలని కోరారు. తెలంగాణ అభ్యర్థన మేరకు అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని కేంద్రం వాయిదా వేసింది.