సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లాల్సి రావడంతో.. తెలంగాణకు కొత్త సీఎస్ ను నియమించాల్సి వచ్చింది. తెరపైకి అనేక పేర్లు వచ్చినా.. శాంతికుమారినే కేసీఆర్ నియమించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.
ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ కలిశారు శాంతికుమారి. ఈ సందర్భంగా సీఎం ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతికుమారి 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గతంలో వైద్య, ఆరోగ్యశాఖ బాధ్యతలు నిర్వహించారు. సీఎంవోలో స్పెషల్ ఛేజింగ్ సెల్ కూడా చేశారు.
తొలిసారి తెలుగు, మహిళా అధికారికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి రాష్ట్రంలో బీసీ వెల్ఫేర్ కమిషనర్ గా పని చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత సీఎంవోలో కీలక పాత్ర పోషించారు శాంతి కుమారి. కేసీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో మెదక్ కలెక్టర్ గా కూడా పనిచేశారు. 2025 ఏప్రిల్ వరకు ఈమె పదవీకాలం ఉండనుంది.
సీఎస్ నియామకం విషయంలో చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. రాష్ట్ర క్యాడర్ లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో వసుధా మిశ్రా, రాణి కుమిదిని, శశాంక్ గోయల్, సునీల్ శర్మ, రజత్ కుమార్, రామకృష్ణారావు, అరవింద్ కుమార్ ఉన్నారు. వీరిలో వసుధా మిశ్రా, శశాంక్ గోయల్, అశోక్ కుమార్ కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. రాణి కుమిదిని కార్మికశాఖ బాధ్యతల్లో ఉన్నారు. సునీల్ శర్మ ఇంధనశాఖ, రజత్ కుమార్ నీటిపారుదల శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రామకృష్ణారావు ఆర్థికశాఖ, అరవింద్ కుమార్ పురపాలకశాఖ బాధ్యతల్లో ఉన్నారు. అయితే.. అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమారిని నియమించింది ప్రభుత్వం.