బడ్జెట్ సమావేశాలు జరిగిన ఆరు నెలల తర్వాత తెలంగాణ అసెంబ్లీ కొలువుదీరింది. సభ్యులందరూ కరోనా నిబంధనలను పాటించాలని కోరారు స్పీకర్ పోచారం శ్రీనివాస్. సభ ప్రారంభమైన వెంటనే చనిపోయిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టారాయన. కాసేపు సభ్యులందరూ మౌనం పాటించారు. సంతాప తీర్మానం అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది. ఇటు శాసనమండలిని కూడా సంతాప తీర్మానం అనంతరం ప్రొటెం స్పీకర్ భూపాల్ రెడ్డి వాయిదా వేశారు.
ఈసారి సమావేశాలు హాట్ హాట్ గా నడిచే అవకాశం ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక, దళితబంధు, నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి సహా పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలు సిద్ధం అయ్యాయి. సమావేశాలు ప్రారంభానికి ముందు బీజేపీ ఎమ్మెల్యే తెలుగుతల్లి ఫ్లై ఓవర్ నుంచి అసెంబ్లీ దాకా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయని.. దళిత బంధు ఒక్క నియోజకవర్గానికే పరిమితం చేయకుండా రాష్ట్రమంతా అమలు చేయాలని డిమాండ్ చేశారు రాజాసింగ్. అసలు ఈ పథకాన్ని హుజూరాబాద్ లో గెలిచేందుకే తీసుకొచ్చారా.. దళితులను మోసం చేయాలని తీసుకొచ్చారా..? అని ప్రశ్నించారు. గతంలో దళితుడ్ని సీఎం చేస్తానని చేయలేదు.. మూడెకరాల భూమి ఇస్తానని ఇవ్వలేదు.. ఇప్పుడు దళిత బంధు అంటూ ఇంకో మోసానికి తెరతీశారా అంటూ మండిపడ్డారు రాజాసింగ్.
రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు. జీడీపీ పెరిగిందని చెబుతున్న ప్రభుత్వం.. 24 వచ్చినా ఇంకా పెన్షన్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు బీజేపీ అండగా ఉంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తుందని చెప్పారు.