అనుకున్నట్లుగానే తెలంగాణ అసెంబ్లీ, మండలిలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఈనెల 28వరకు సమావేశాలు జరగాల్సి ఉంది. గత బీఏసీ సమావేశంలో 28వరకు సమావేశాలు నిర్వహించాలని, అవసరం అయితే సభను పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ బీఏసీ సమావేశంలో ప్రకటించారు.
అయితే, సమావేశాలను కొనసాగించాల్సి ఉన్నప్పటికీ కరోనా దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం ప్రకటించారు. ఉదయం అసెంబ్లీ, మండలిలు మొదలవ్వక ముందే వీరిద్దరు చర్చలు జరిపారు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకటం, అసెంబ్లీ బందోబస్తులో ఉన్న పలువురు పోలీసులకు, అసెంబ్లీ ఉద్యోగులకు కూడా కరోనా సోకిందని… అందరి ఆరోగ్యంపై ఆలోచించి ఈ నిర్ణయానికొచ్చినట్లు ప్రకటించారు. దీనిపై అన్ని పార్టీల నాయకులతో చర్చలు జరిపాక మండలిని చైర్మన్, అసెంబ్లీని స్పీకర్ నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం బిల్లు, ప్రైవేటు యూనివర్శిటీల కోసం తెచ్చిన ఆర్డినెన్స్ కు చట్టబద్ధత, ఉద్యోగుల జీతాలను కట్ చేస్తూ తెచ్చిర ఆర్డినెన్స్ కు చట్టబద్ధత, మున్సిపల్, పంచాయితీ రాజ్ చట్టాల్లో పలు మార్పుల కోసం బిల్లులను ఆమోదింపజేసుకుంది.