తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు అధికారక ప్రకటన వచ్చేసింది.
శనివారం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో రాష్ట్ర బడ్జెట్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, అధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది బడ్జెట్ లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్ద పీట వేయనున్నారు. ఇందుకోసం సుమారు 37,000 కోట్లు కేటాయించనున్నట్లు సమాచారం. ఆ కేటాయించిన నిధుల్లో 16 వేల కోట్లు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ 2.85 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నట్టు సమాచారం. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొలిక్కి వచ్చిన ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా నిధులు కేటాయించడంతో పాటు కాళేశ్వరం సహా వివిధ ప్రాజెక్టులకు తీసుకున్న రుణాలకు అసలు, వడ్డీ తిరిగి చెల్లించేందుకు అవసరమైన నిధులనూ బడ్జెట్ లో కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి రాష్ట్ర బడ్జెట్ ను మార్చి మొదటి వారంలో ప్రవేశ పెడుతుంటారు. అయితే.. సీఎం కేసీఆర్ కొన్ని నెలలుగా జాతీయ రాజకీయాలపై సీరియస్ గా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ ను ముందే ప్రవేశ పెడుతున్నారు. అయితే.. ప్రతిపక్షాలు మాత్రం ఎన్నికలను ముందుగానే తీసుకొచ్చే క్రమంలో బడ్జెట్ ను ముందుగా ప్రవేశ పెడుతున్నట్లుగా అనుమానిస్తున్నాయి.