కోమటిరెడ్డి, సంపత్‌ సభ్యత్వాల రద్దు, 11 మంది సస్పెన్షన్

తెలంగాణ అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ సృష్టించిన గందరగోళాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యవహారశైలిపై విచారం వ్యక్తంచేసిన స్పీకర్ మధుసూదనాచారి.. నిన్నటి ఘటన దురదృష్టకరమని అన్నారు. కోమటిరెడ్డి వెంకటిరెడ్డితోపాటు సంపత్‌ శాసనసభ్యత్వాలపై వేటు వేశారు స్పీకర్. దీనికి సంబంధించిన తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు మంత్రి హరీష్‌రావు.

కోమటిరెడ్డి విసిరిన హెడ్‌ఫోన్స్‌ తగిలి శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ కంటికి గాయమైంది. వెంటనే ఆయన్ని సరోజినిదేవి కంటి ఆస్పత్రికి తరలించగా స్వామిగౌడ్‌ కుడికన్ను కార్నియా దెబ్బతిన్నదని వైద్యులు వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్వామిగౌడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మరోవైపు 11 మంది కాంగ్రెస్ సభ్యులు జానారెడ్డి, జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, చిన్నారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, డీకె అరుణ, పద్మావతి రామ్మోహన్‌రెడ్డి, వంశీచంద్, మాధవరెడ్డి, భట్టి విక్రమార్కలపై సస్పెన్షన్ వేటు వేశారు. బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు 11 మంది సభ్యులపై ఈ వేటు కొనసాగుతోంది. అటు మండలిలో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలపై వేటు వేశారు డిప్యూటీ ఛైర్మన్.