సెప్టెంబర్ 17 తర్వాత తెలంగాణ వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం మొగ్గుచూపుతుంది. నిజానికి సెప్టెంబర్ రెండో వారంలోనే సమావేశాలు నిర్వహించాలని మొదట భావించినా… సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించాలని ఒకపార్టీ, విలీన దినోత్సవమని మరో పార్టీ పట్టుబడుతున్నాయి. అధికారికంగా నిర్వహించాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ లు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై కేసీఆర్, టీఆర్ఎస్ తమ నిర్ణయం చెప్పటం లేదు. దీంతో సెప్టెంబర్ 17 తర్వాతే అసెంబ్లీ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.
దీంతో, సెప్టెంబర్ 16న మధ్యాహ్నం 2గంటలకు ప్రగతి భవన్ లో తెలంగాణ మంత్రివర్గ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాలపైనే ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశాల్లో కేసీఆర్ కొత్తగా తెచ్చిన దళిత బంధు పథకానికి చట్టబద్ధత తేవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దళిత బంధు అమలుపై ఇప్పటికే కోర్టుల్లో కేసులున్న నేపథ్యంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా చట్టబద్ధత కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాల సమాచారం.