తెలంగాణ అసెంబ్లీ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు ఓకే చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా ఆరు గ్రామ పంచాయతీల ఏర్పాటుకు పంచాయతీరాజ్ చట్టంలో సవరణలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ బిల్లును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టగా.. శనివారం సభ ఆమోదించింది.
ఈ నిర్ణయంతో భద్రాచలం మండలంలోని భద్రాచలం, సీతారాంనగర్, శాంతినగర్.. బూర్గంపాడు మండలంలో సారపాక, ఐటీసీ.. ఆసిఫాబాద్ జిల్లాలోని రాజంపేటను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు కానున్నాయి.
భద్రాచలంలో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిందన్నారు మంత్రి ఎర్రబెల్లి. పరిపాలనా సౌలభ్యం కోసం భద్రాచలాన్ని మూడు గ్రామ పంచాయతీలు చేశామని తెలిపారు. మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
మరోవైపు వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లును కూడా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎలాంటి చర్చ లేకుండానే ఏకగ్రీవంగా ఈ బిల్లు ఆమోదం పొందింది.