తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని అధికార పార్టీ యోచిస్తుంది. ఇప్పటికే ఈ విషయంపై సీఎం కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులకు దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. అయితే, కరోనా పేరుతో హుజురాబాద్ ఉప ఎన్నికను వాయిదా వేయించిన రాష్ట్ర ప్రభుత్వం… అసెంబ్లీని మాత్రం వెంటనే సమావేశపర్చాలన్న నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది.
హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కేసీఆర్ దళిత బంధు పథకం తీసుకొచ్చారు. తెలంగాణలో బలమైన ఓటు బ్యాంకు ఉన్న దళిత వర్గం ఓట్లను ఈ పథకం కొల్లగొడుతుందని టీఆర్ఎస్ ధీమాగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకంతో టీఆర్ఎస్ కు తిరుగుండదు అని నమ్మకంగా ఉన్నారు. అయితే, దీన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే కోర్టులో కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో దళిత బంధుకు చట్టబద్ధత కల్పించాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. అప్పుడు కోర్టు చిక్కులు కూడా ఉండవని భావిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ హైదరాబాద్ రాగానే అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుండి నిర్వహించాలి, ఎన్ని రోజులు నిర్వహించాలన్న అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. ఈ సమావేశాల్లో దళిత బంధు పై పూర్తిస్థాయిలో చర్చ జరగాలని టీఆర్ఎస్ కోరకుంటుంది. అయితే, సెప్టెంబర్ 17పై రాజకీయ పార్టీల్లో భిన్నాభిప్రాయాలున్నందున ఆ తర్వాతే అసెంబ్లీ సమావేశాలుంటాయని తెలుస్తోంది.