ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఫిబ్రవరి 3న రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజున రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించను న్నారు. ఫిబ్రవరి 6న ప్రభుత్వం 2023-24 వార్షిక బడ్జెట్ ను ఉభయ సభలకు సమర్పించనుంది.
రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సూచనల మేరకు సోమవారం వివాదం సద్దుమణిగింది. సీఎం కేసీఆర్ సూచనల మేరకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి నేతృత్వంలో అధికారుల బృందం రాజ్ భవన్‌కు వెళ్లి విషయాన్ని తెలియజేశారు. ఇది వరకున్న సభా సాంప్రదాయాల ప్రకారం గవర్నర్‌ను అసెంబ్లీకి ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా జీఏడీ, ప్రొటోకాల్ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆర్థిక మంత్రి హరీష్‌రావు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, అసెంబ్లీ కార్యదర్శి వేదాంతం నర్సింహాచార్యులు ఇతర ఉన్నతాధికారులతో బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించారు.
అలాగే బడ్జెట్ సమావేశాలకు ఒకరోజు ముందు (ఫిబ్రవరి 2న) మంత్రిమండలి సమావేశమై వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలతో పాటు గవర్నర్ ప్రసంగ పాఠాన్ని కూడా ఆమోదించవలసి ఉంటుంది. ప్రసంగ పాఠంలో పొందుపర్చవలసిన అంశాలు, వివిధ వర్గాల ప్రజలకు అందిన అభివృద్ధి ఫలాలు, ప్రభుత్వం ఎంచుకున్న లక్ష్యాలు, సాధించిన ఫలితాలు, ఖర్చుచేసిన నిధులకు సంబంధించిన అంశాలపై సీఎం కేసీఆర్ అధికార యంత్రాంగానికి మార్గనిర్దేశం చేశారు.