హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయ పార్టీల్లో కాక రేపుతోంది. హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ అన్ని ప్రయత్నాల్ని ఇప్పటికే మొదలుపెట్టగా, ఇది తమ కంచుకోటగా వుంటున్న ఈ స్థానంలో మొన్నటి ఎంపీ ఎన్నికలలో సాధించిన విజయ పరంపర కొనసాగిస్తామంటూ కాంగ్రెస్ చెప్పుకొస్తోంది. ఇక మూడో శక్తిగా చాప కింద నీరులా విస్తరిస్తున్న బీజేపీ ఇప్పుడు బలమైన అభ్యర్ధిని రంగంలోకి దించబోతోంది. ఆమె శ్రీకళారెడ్డి.
కీసర శ్రీకళారెడ్డి, బీజేపీ హుజూర్‌నగర్ అభ్యర్ధి. ఈ పేరు కొత్త కావొచ్చు కానీ, ఆమె కుటుంబం హుజూర్‌నగర్‌కు కొత్తకాదు. ఈమె తండ్రి జితేంద్రరెడ్డి 1972లో హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్‌గా గెలిచారు. ఆమె భర్త ధనుంజయ్ యూపీ నుంచి గతంలో ఎంపీగా పనిచేశారు. ఇలా ఆమె ఫ్యామిలీ నుంచి ప్రజా ప్రతినిధులు చట్ట సభల్లోకి వెళ్లారు. దాంతో ఆమె కూడా రాజకీయాల్లో రాణించేందుకు ఎప్పటి నుంచో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న శ్రీకళారెడ్డిని హుజూర్‌నగర్‌లో బలమైన అభ్యర్ధిగా బీజేపీ భావిస్తోంది.
రాజకీయాలపై ఆసక్తి ఉన్న శ్రీకళారెడ్డి 2004లో టీడీపీలో చేరారు. అక్కడి నుంచి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. ఎమ్మెల్యే కావాలన్న కోరికతో కోదాడ టీడీపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. తనను గెలిపించాలని హెలికాప్టర్‌లో కరపత్రాలు పంచి సంచలనం సృష్టించారు. ఆ ఎన్నికల్లో ఆమెకు టికెట్ రాకపోవడంతో వైసీపీలో చేరారు. ఆ తరువాత ఇటీవల రాజ్యసభ ఎంపీ గరికపాటి మోహన్‌రావుతో కలిసి బీజేపీలో చేరారు. ఇప్పుడు హుజూర్‌నగర్ బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. కోదాడ నుంచి ఎమ్మెల్యే కావాలన్నది ఆమె చిరకాల కోరిక. అనుకోకుండా హుజూర్‌నగర్ ఉప ఎన్నిక రావడంతో ఆమెను బీజేపీ బరిలోకి దింపింది. ఉప ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్‌లకు ఆమె సరైన అభ్యర్ధి అని భావిస్తోంది.