తెలంగాణ కాంగ్రెస్‌పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ఆ పార్టీకి సరైన నాయకత్వం లేదని అన్నారు. బయటి వాళ్లకు ఆ పార్టీని ఆరేళ్లపాటు లీజుకిచ్చారని సెటైర్లు వేశారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు అసలు సిసలైన ప్రత్యామ్నాయం బీజేపీనేనని స్పష్టం చేశారు. మార్పు కోసం జరిగే పోరాటంలో ముందుండే తామేనని చెప్పుకొచ్చారు . బర్కత్ పురాలోని హైదరాబాద్ సెంట్రల్ ఆఫీసులో పాదయాత్ర ప్రిపరేటరీ మీటింగ్ ముగింపు సందర్భంగా బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో అరాచక, దుర్మార్గపు పాలనతో క్షేత్ర స్థాయి కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. వారంతా ఇప్పుడు కసితో ఉన్నారని చెప్పారు. పాదయాత్రతో బీజేపీ తెలంగాణలో చరిత్ర సృష్టించబోతోందని.. కనీవినీ ఎరగని రీతిలో పాదయాత్ర ప్రారంభం కానుందని తెలిపారు. జాతీయ నాయకత్వం, కేంద్ర మంత్రులు కూడా పాదయాత్రకు వచ్చి సంఘీభావం తెలపబోతున్నట్టు చెప్పారు. పాదయాత్రతో తెలంగాణలో పెనుమార్పులు రాబోతున్నాయని జోస్యం చెప్పారు.