– పోడు సమస్యలపై బీజేపీ సమరశంఖం
– ‘ప్రజల పల్లె ఘోష’ పేరుతో కార్యక్రమాలు
– బర్త్ డే రోజు నో సెలెబ్రేషన్స్ అన్న బండి
– కరీంనగర్ లో మౌనదీక్షకు రెడీ
– కోర్ కమిటీ మీటింగ్ లో కీలక నిర్ణయాలు
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత బీజేపీ ఫుల్ స్పీడ్ తో వెళ్తోంది. ఓవైపు చేరికలపై దృష్టి పెడుతూనే.. ఇంకోవైపు ప్రజా సమస్యలపై పోరుబాట చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పోడు రైతులపై దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీ భేటీ అయ్యింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు కమలనాథులు.
ముఖ్యంగా పోడు భూముల సమస్య, ధరణికి వ్యతిరేకంగా మౌనదీక్షతో పాటు ఈనెల 21 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘ప్రజల పల్లె ఘోష’ పేరుతో బైక్ ర్యాలీలు నిర్వహించాలని తీర్మానించారు. బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన కోర్ కమిటీ సమావేశానికి పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్ హాజరయ్యారు.
రాష్ట్రంలో గిరిజన రైతులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ అలాగే.. ధరణి పోర్టల్ లోని లోపాలను సరిదిద్ది రైతులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని అంటోంది. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ‘మౌనదీక్ష’ చేపట్టనుంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వరలల్ష్మి గార్డెన్స్ లో సోమవారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఈ దీక్ష ఉంటుంది. ఇందులో బండి సంజయ్ సహా పలువురు నేతలు పాల్గొననున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలంతా తమ ప్రాంతాల్లో ‘మౌనదీక్ష’కు సంఘీభావం తెలపాలని ఎంపీ సోయం బాపూరావు తెలిపారు. మరోవైపు సోమవారం బండి సంజయ్ పుట్టినరోజు. అయితే.. గిరిజనుల కోసం చేస్తున్న దీక్ష కోసం బర్త్ డే సంబరాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. కోర్ కమిటీ సమావేశం తర్వాత బండికి శాలువా కప్పి ముందుగానే పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు తరుణ్ చుగ్. ఎంపీ అరవింద్, స్వామిగౌడ్, వివేక్, చాడా సురేష్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సహా పలువురు ఉన్నారు. వారు కూడా బండి అభినందనలు తెలియజేశారు.