తెలంగాణ బీజేపీ ఆశలన్నీ ఇక సెప్టెంబర్ 17న అటెండ్ అయ్యే అమిత్ షా సభ పైనేనా…? అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వటం, అంతకు ముందు దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపుతో బీజేపీ రాష్ట్రంలో కాస్త ఊపు వచ్చింది. ఇక ఈటల బీజేపీలో చేరిక తర్వాత హుజురాబాద్ లో గెలుపు ఖాయం అన్న ప్రచారం, బండి సంజయ్ పాదయాత్రతో పార్టీ దూకుడు మీద ఉందని అంతా భావించారు. కేసీఆర్ ను జైలుకు పంపుతాం అంటూ నేతలు చేసిన ప్రసంగాలతో బీజేపీ నేతల్లో కొత్త ఉత్సాహం కనిపించింది.
కానీ, ఢిల్లీలో కేసీఆర్ అడగ్గానే కేంద్రమంత్రులు, ప్రధాని సమయం ఇవ్వటంతో పాటు హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదాకు కేసీఆర్ కు బీజేపీ కేంద్ర నాయకత్వం సహకరించిందన్న అభిప్రాయం జనాల్లోకి బలంగా వెళ్లిపోయింది. ఓ దశలో గల్లీలో కుస్తీ…ఢిల్లీలో దోస్తీ అని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు నిజమేనన్న అభిప్రాయం ఏర్పడింది. బండి సంజయ్ వంటి నేతలు ఎంత ఖండించినా బీజేపీ శ్రేణులు కూడా అయోమయంలోనే ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో సెప్టెంబర్ 17 నిర్మల్ లో పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హోంమంత్రి అమిత్ షా హజరుకాబోతున్నారు. ఈ టూర్ లో అమిత్ షా టార్గెట్ కేసీఆరా… కాంగ్రెస్సా…? అనే చర్చ జరుగుతోంది. అంతేకాదు నేతలతో సమావేశంలోనూ కేసీఆర్ పై పోరాటంలో అమిత్ షా క్లారిటీ ఇస్తారని రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. ఈ టూర్ ను బట్టే తెలంగాణ బీజేపీ ప్రయాణం ఎలా ఉంటుందన్నది ఆధారపడి ఉంటుందని కామెంట్ చేస్తున్నారు.