సీఎం కేసీఆర్ మహా మొండి… నయానో బయానో పని చేయించుకోవాలి కానీ ఎదురు తిరిగితే పని కాదు. ఇది టీఆరెఎస్, కేసీఆర్ సన్నిహితుల మాట. కానీ టీఆర్ఎస్ అనుబంద సంఘం లీడర్‌గా ఉండి, కేసీఆర్‌ను-ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టి… కోర్టులో చీవాట్లు తినేలా చేస్తున్నాడు. కేసీఆర్ కన్నా జగ మొండిలా వ్యవహరిస్తోన్న అశ్వద్ధామ రెడ్డి వెనుక బీజేపీ హస్తం ఉందా…? బీజేపీ వెన్నుదన్నుగా నిలిచి కేసీఆర్‌పై పోరాటానికి ఉసిగొల్పుతోందా…?
48వేల మంది కార్మికులు… నెల రోజులకు పైగా సమ్మె… రెండు నెలలుగా జీతాల్లేవ్ అయినా కార్మికులు పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ నాయకుడు అశ్వద్ధామ రెడ్డి సీఎం కేసీఆర్‌ను జయిస్తాం అని ధీమాగా ఉన్నాడు, డెడ్‌లైన్‌లు అంటూ కేసీఆర్ దిగొస్తున్నారు కానీ పోరాట పంథాను కార్మిక లోకం మాత్రం విడవటం లేదు. మొండి ఘటంగా పేరున్న సీఎం కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అంటోన్న అశ్వద్ధామ వెనుక బీజేపీ హస్తం ఉందా…? అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
అయితే… బీజేపీ మాటలు, తాజాగా కోర్టులో కేంద్రం వాదనలతో పాటు తెలంగాణ మంత్రి పువ్వాడ లేఖకు కేంద్రమంత్రి గడ్కరీ సమాధానం చూస్తే ఖచ్చితంగా ఎదో ఉందన్న అనుమానం అయితే కలుగుతోంది అంటున్నారు విశ్లేషకులు. దాదాపు ఆరు సంవత్సరాలుగా ఆర్టీసీ వ్యవహరంలో వేలు పెట్టని బీజేపి, కేంద్రం ఇప్పుడు మాత్రమే విభజనకు మేం ఒప్పుకోం, మా దృష్టిలో విభజనే జరగలేదంటూ ఎదురు తిరుగుతుంది అని ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక పోరాటం అంటే సహజంగా ప్రతిపక్ష పార్టీ ముందుంటుంది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ కన్నా బీజేపీ కార్మికుల పక్షాన గట్టిగా నిలబడుతోంది. మీరు కొట్లాడండి, మీకు మేం అండగా ఉంటాం అని అభయహస్తాన్ని అందిస్తోంది. అందుకే కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీ అధినాయకత్వం కూడా ఆర్టీసీ కార్మికలోకానికి మద్దతిస్తోంది. తద్వారా రాష్ట్రంలో కేసీఆర్‌పై పోరాటాన్ని మొదలుపెట్టిందని భావించవచ్చని, రాబోయే రోజుల్లో ఇలా కేసీఆర్‌ను ఇరుకున పెట్టే నిర్ణయాలు మరిన్ని జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో పాగా వేసేందుకు బీజేపీ ఆతృతతో ఎదురుచూస్తుందని, అందుకే ఇలా బలమైన కార్మిక వర్గాల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తోందని, ఇప్పటికే సింగరేణిలో జెండా ఎగరేసేందుకు కూడా ప్లాన్ అమలు చేస్తుందని అభిప్రాయపడుతున్నారు.
దీంతో… అశ్వద్ధామరెడ్డి వెనుక కేవలం 48వేల మంది కార్మికులు, వారి కుటుంబాలే కాదు… బీజేపి, కేంద్ర ప్రభుత్వం కూడా అండగా ఉన్నాయని, అందుకే అశ్వద్ధామ రెడ్డి కూడా కేసీఆర్‌తో సమానంగా గట్టిగా నిలబడగలుగుతున్నారని అంటున్నారు విశ్లేషకులు.
ఇప్పటికే ఆర్టీసీ పరిస్థితి, కార్మికులకు వెన్నుదన్నుగా బీజేపీ ఉందని స్పష్టం కావటంతో… సీఎం కేసీఆర్ దిగివస్తారా అదే పట్టింపులతో చివరిదాకా లాగుతారో చూడాలి.