బీజేపీ తెలంగాణ నేతలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక భేటీ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ నేతలకు అమిత్ షా నుంచి పిలుపు వచ్చింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులంతా ఢిల్లీకి రావాలని అమిత్ షా కార్యాలయం నుంచి కాల్స్ వచ్చినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఇప్పటికే పలువురు హస్తినకు పయనమయ్యారు. మిగతా నేతలు రేపు ఢిల్లీ వెళ్తారని సమాచారం. రేపు మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర నేతలతో అమిత్ షా భేటీ అవుతారని ఫోన్ కాల్‌లో చెప్పారు. మరోవైపు ఈ సమావేశాల్లో ఎలాంటి అంశాలపై చర్చిస్తారనేది సస్పెన్స్ గా మారింది.
రాష్ట్రంలో కీలక నేతలైన బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల, వివేక్, జితేందర్ రెడ్డితో పలువురు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. భేటీలో రాష్ట్ర రాజకీయాలు, ఎన్నికల ప్రణాళిక, మిషన్ 90పై వారితో అమిత్ షా చర్చిస్తారని తెలుస్తోంది.
ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఢిల్లీ నుంచి అగ్రనేతలు రాష్ట్ర పర్యటనలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూపొందించిన త్రిముఖ వ్యూహం బీజేపీకి ఘన విజయాన్ని తెచ్చి పెట్టంది. దీంతో ఇక్కడ కూడా ఆ వ్యూహాన్నే అమలు చేయాలని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం.