పేరుకు జాతీయ పార్టీ. కేంద్రంలో అధికారంలో ఉన్నారు. అందుకే ఆ పార్టీ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప కూడా దాటడం లేదన్న విమర్శలు మొదలయిపోయాయి. బీజేపీ అండగా ఉంటుంది, కేంద్రం సహాకారం ఉంటుందని బీజేపీ నేతల మాటలు విని వేల మంది ఆర్టీసీ కార్మికులు తమకు అండగా ఉంటారు అని ఆశపడ్డారు. ఇక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయితే అది చేస్తాం, ఇది చేస్తాం అని స్టేట్మెంట్ కె పరిమితం అవుతున్నారు. అదే పార్టీ కి చెందిన కేంద్ర మంత్రి మాత్రం ఆర్టీసీ సమ్మె రాష్ట్రం పరిధిలోకి వస్తుంది అని ఆర్టీసీ కార్మికుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు.
కేంద్రంలో మేం అధికారంలో ఉన్నాం, కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు చేస్తే చూస్తూ ఊరుకోమని, కేసీఆర్ మెడలు వంచి.. ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం అని పార్టీ నాయకులు చెప్తుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం ఆర్టీసీ సమ్మె రాష్ట్ర పరిధిలోకి వస్తుంది అంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ స్టేటమేంట్స్ చూసి ఆర్టీసీ కార్మికులు తమను కేంద్ర ప్రభుత్వం అదుకుంటుంది అని చాలా ఆశలే పెట్టుకున్నారు. కానీ నెలలు గడుస్తున్నా కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన లేకపోగా కేసీఆర్ మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. కార్మికులు చేస్తున్న ఆందోళన లో అడపదపడప పాల్గొని ప్రసంగాలు చేయడం మినహా బీజేపీ నేతలు చేస్తుంది శూన్యం. ఇక కేంద్రమంత్రి వ్యాఖ్యలు టీఆర్ఎస్‌కు మరింత ఊతం ఇస్తున్నాయి.
బీజేపీ రాష్ట్ర నేతల మాటలు విన్న ఆర్టీసీ కార్మికులు తమకు అనుకూలంగా ఏదో చేసేస్తారు అని పెట్టుకున్న భ్రమలు తొలిగిపోతున్నాయి. అందుకే ఇక ఏ పార్టీని నమ్ముకోకుండా… తామే తేల్చుకోవాలని డిసైడ్ అయ్యాయి కార్మికసంఘలు.