తిరుపతి ఉప ఎన్నికను బీజేపీ ప్రెస్టిజియస్ ఇష్యూగా తీసుకుంటోంది. ఎలాగైనా గెలిచి ఏపీలో సెపరేట్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఇందుకోసం తెలంగాణ బీజేపీ నేతలను కూడా హైకమాండ్ రంగంలోకి దింపాలని ఆలోచిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
ఇటీవల తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబద్ ఎన్నికల్లో అనూహ్యంగా ఆ పార్టీ పుంజుకోవడం ఢిల్లీ పెద్దలని కూడా ఆశ్చర్యపరిచిందట. ఊహించని విధంగా ఫలితాలు రావడంతో.. తమ పార్టీ పట్ల తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ మరింత పెరుగుతోందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు .ఇదే ఊపును కంటిన్యూ చేసేందుకు తిరుపతి ఉప ఎన్నికల కోసం తెలంగాణ నేతలను ప్రచారంలోకి దింపే ఉద్దేశ్యంతో ఉందని తెలుస్తోంది. బీజేపీ గురించి బలమైన గళాన్ని వినిపించే తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావును తిరుపతి ఆపరేషన్ కోసం పంపాలని అనుకుంటోందట. ప్రచారం కోసం ఎవరో తెలుగు రాని ఇతర రాష్ట్ర నేతలని తీసుకురావడం కంటే.. తెలంగాణ నేతలను రంగంలోకి దింపితే మంచి ఫలితాలు వస్తాయని ఏపీ క్యాడర్ భావిస్తోందట.
తెలంగాణలో బీజేపీ దూకుడు పెరగడానికి.. టీఆర్ఎస్, ఎంఐఎంలపై వ్యతిరేక ప్రచారం బాగా కలిసొచ్చింది. అయితే ఏపీలో రాజకీయం కొంత విభిన్నంగా ఉంటుంది. దీంతో అన్యమత ప్రచారం, ఆలయాలపై దాడుల వంటి అంశాలపై కొంత వర్కవుట్ చేసి రెడీగా ఉండాలని తెలంగాణ నేతలకు హైకమాండ్ బీజేపీ అధిష్టానం చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది.