ఏపీలో జన ఆశీర్వాద యాత్ర నిర్వహించి.. తెలంగాణలో అడుగు పెట్టారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కోదాడలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా పార్టీ ముఖ్య నేతలు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
కిషన్‌రెడ్డి తన అభిమాన నాయకుడని అన్నారు బండి సంజయ్. కష్టపడి పని చేసే వారికి బీజేపీలో పదవులు వస్తాయని చెప్పడానికి కిషన్ రెడ్డే నిదర్శనమని చెప్పారు. ఈ ఏడేళ్ల పాలనలో బీజేపీ ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుందన్న ఆయన… తమ పోరాటానికి భయపడే కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి బయటకు వచ్చారని సెటైర్లు వేశారు. తెలంగాణ తల్లి కేసీఆర్ గడీలో బందీ అయ్యిందని.. విముక్తి కోసం బీజేపీ కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు.
మంత్రివర్గంలో ఎస్సీలు ఎంతమంది ఉన్నారో కేసీఆర్ చెప్పాలని నిలదీశారు బండి సంజయ్. లాఠీ దెబ్బలు, జైళ్లకు బీజేపీ భయపడదని…. గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా ఎగరేసేందుకు అందరం కలిసి కష్టపడి పనిచేద్దామని చెప్పారు.
ఇక టీఆర్ఎస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చింది కల్వకుంట్ల కుటుంబం కోసమేనా అని ప్రశ్నించారు. ఇంకొన్ని రోజులు కేసీఆర్ సీఎంగా కొనసాగితే రాష్ట్రంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్నారు. కేసీఆర్ ను గద్దె దించాల్సిన అవసరం ఉందన్న ఆయన.. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ ను గెలిపించాలని కోరారు.