నో కాంగ్రెస్.. ఓన్లీ టీఆర్ఎస్ ఇదీ.. తెలంగాణ బీజేపీ ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం. రాష్ట్రంలో విపక్షంగా కాంగ్రెస్ బలహీనంగా ఉండటంతో.. ఆ పార్టీపై విమర్శలు పూర్తిగా మానుకోవాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించుకుందని తెలిసింది. కాంగ్రెస్ విషయంలో ఎంత సైలెంట్‌గా ఉంటే.. ఆ పార్టీని అంత దెబ్బతీసినట్టేనని కమలదళం భావిస్తోంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ తమనే భవిష్యత్ ప్రత్యర్థిగా భావిస్తూ మాటల దాడి పెంచుతుండటాన్ని.. బీజేపీ తమకు రాష్ట్రంలో పెరిగిన బలంగా అభిప్రాయపడుతోంది. గులాబీ నేతలు ఎన్ని విమర్శలు చేస్తే.. అంతగా బలపడుతున్నట్టుగా ఖుషీ అవుతోంది. దీనికి తగ్గట్టే ఇటీవల ఆ పార్టీపై టీఆర్ఎస్ నేతలు మూకుమ్మాడి దాడి చేస్తూ.. బీజేపీని పరోక్షంగా పతాకశీర్షికలకెక్కిస్తున్నారు.
దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రస్తావన తీసుకురాకపోవడంతో… ప్రజలు తమనే ప్రత్యామ్నాయంగా భావించారన్న అంచనాకు వచ్చారు బీజేపీ నేతలు. ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికల్లో ఇది చాలా వర్కువట్ అయ్యిందని గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ఏ రకంగానూ తమకు పోటీ కాదని.. అధికార పార్టీతో ఫైట్ మాత్రమే లాభిస్తుందని కింది స్థాయి నేతలకు కూడా రాష్ట్ర నాయకత్వం సూచనలు చేస్తోందట. కాంగ్రెస్‌లో ఎంతటి సీనియర్ నేత బీజేపీపై విమర్శలు చేసినా.. కౌంటర్ ఇవ్వకపోవడమే.. వారిని కౌంటర్ చేసినట్టుగా అవుతుందని బోధిస్తోందట బీజేపీ స్టేట్ హైకమాండ్.