బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి. బీఆర్ఎస్ నేతలు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నాయి. ఇదంతా రాజకీయ కక్ష సాధింపే అని విమర్శలు చేస్తున్నాయి. దీంతో బీజేపీ కూడా ఎంటర్ అయింది. బీఆర్ఎస్ నేతల కామెంట్స్ కు ధీటైన కౌంటర్స్ ఇస్తున్నారు కమలనాథులు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు బండి సంజయ్. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న ఆయన.. తప్పు చేసిన వారంతా విచారణను ఎదుర్కోవాల్సిందేనని చెప్పారు. సీబీఐ, ఈడీ విచారణకు కవిత సహకరించాలని సూచించారు. లిక్కర్ స్కాంలో నిందితులు తనకు పరిచయస్తులేనని ఆమె ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారని గుర్తు చేశారు. తప్పు చేయకపోతే కోర్టుకు వెళ్లి తన నిజాయితీని నిరూపించుకోవాలని సూచించారు. అయినా, కవితకు నోటీసులకు తెలంగాణ సమాజానికి ఏం సంబంధం ఏముంటుందని ప్రశ్నించారు బండి.
ఈడీ కేసు విషయంలో నీతివంతులైతే గగ్గోలు ఎందుకు పెడుతున్నారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కవితను తలవంచమని ఎవరూ చెప్పటం లేదని.. తప్పు లేకుంటే నిజాయితీని నిరూపించుకోవాలని సూచించారు. తెలంగాణ సమాజం అంటే మీ కుటుంబమేనా.. ఢిల్లీకి వెళ్లి లిక్కర్ వ్యాపారం చేసింది, సెల్ ఫోన్ పోన్లు పగలగొట్టింది, అక్రమార్కులతో చేయి కలిపింది ఎవరో తేలాలన్నారు. ఈడీ కేసుతో బీజేపీకి సంబంధం లేదన్న ఆయన.. నోటీసులకే ఉలిక్కి పడితే ఎలా అరెస్టు చేయలేదుగా అంటూ వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఆత్మగౌరవం అంటే కవిత ఒక్కరేనా అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. కవిత స్పెషల్ కాదని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇస్తున్నాయని తెలిపారు. విచారణ పూర్తయ్యాక విషయం ఏంటో తెలంగాణ ప్రజలకు తెలుస్తుందన్నారు. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ ను ఖుషీ చేయడానికి మాట్లాడుతున్నారని.. బీజేపీని ప్రశ్నిస్తున్నందుకే కేంద్రం దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని నోటీసులు ఇస్తూ కక్ష సాధిస్తోందన్న చేస్తున్న విమర్శలను ఖండించారు. ఇందులో కక్ష సాధింపు ఏమీ లేదన్నారు. నిజానికి బీఆర్ఎస్ పార్టీనే ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు డీకే అరుణ.