బీజేపీ కార్నర్ సమావేశాలు, ఆ పార్టీ నేతలపై ప్రభుత్వం చేస్తున్న దాడులపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు పూర్తి చేసిన కార్నర్ సమావేశాలపై ఆయన సమీక్షించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు సమావేశాలను పూర్తి చేసేలా చూడాలని నేతలను ఆయన ఆదేశించారు.
ఈ నెల 10 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 11వేలకు పైగా కార్నర్ సమావేశాలు నిర్వహించాలని పార్టీ ముందస్తుగా ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కానీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. పది రోజుల్లో కేవలం 6వేల కార్నర్ సమావేశాలను మాత్రమే పార్టీ పూర్తి చేయగలిగింది.
ఈ క్రమంలో మిగిలిన మరో 5వేల కార్నర్ సమావేశాలు మూడు రోజుల్లో పూర్తి చేయాలని బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు సమన్వయ కర్తలను ఆయన ఆదేశించారు. ఏయే జిల్లాల్లో స్పందన తక్కువగా ఉందో ఆయా ప్రాంతాలను గుర్తించాన్నారు. వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆయన సూచించారు.
ఆయా జిల్లాలకు రాష్ట్ర స్థాయి నాయకులను పరిశీలకులుగా పంపించాలన్నారు. అనుకున్న లక్ష్యాన్ని మూడు రోజుల్లో పూర్తయ్యేలా జిల్లా అధ్యక్షులు చొరవ చూపాలని కార్నర్ సమావేశాల సమన్వయ కర్త వెంకటేశ్వర్లకు ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ నేతలు వారి అభిప్రాయాలను బండి సంజయ్‌తో పంచుకున్నారు.