తెలంగాణలో ఉపఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పొలిటికల్ గా హీట్ పెరిగిందనేది కాదనలేని సత్యం. టిఆర్ఎస్, కాంగ్రెస్ ఉపఎన్నికల ప్రచార జోరులో ఉంటే బీజేపీ మాత్రం అభ్యర్థిని వెతుక్కొనే పనిలోనే ఇబ్బంది పడుతోంది. అభ్యర్థి ఎంపిక కోసమే ప్రత్యేకంగా కోర్ కమిటీ సమావేశం పెట్టినా ఏదీ తేల్చుకోలేని పరిస్థితిలో బీజేపీ ఉన్నట్టు అర్ధమవుతోంది. ఇంత హడావిడిగా పెట్టిన కోర్ కమిటీలో బీజేపీ చర్చించిన విషయాలు ఏమి లేవు.
పార్లమెంట్ ఎన్నికల నుండి తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందనేది కమలనాథుల వాదన. టిఆర్ఎస్ కాంగ్రెస్ లు మాత్రం బీజేపీకి అంత సీన్ లేదు, బీజేపీని సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదని లైట్ తీసుకుంటున్నాయి. బీజేపీ అస్థిత్వాన్ని చాటుకొనే అవకాశం హుజూర్ నగర్ ఉప ఎన్నిక రూపంలో వచ్చింది. ఈ ఉప ఎన్నికలో బీజేపీ గెలిస్తే తెలంగాణ ప్రజలు ఆ పార్టీని సీరియస్ గానే తీసుకొనే అవకాశముంది. అయితే పక్క పార్టీలు ప్రచారంలో దూసుకుపోతుంటే బీజేపీ మాత్రం అభ్యర్థిని ఖరారు చేసుకున్న పరిస్థితి కూడా లేదు. ఈ అలస్యమే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పెద్ద ఎఫెక్ట్ ఇచ్చిందనేది కొట్టిపారేయలేని అంశం. అయితే ఈ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ అదే తప్పు చేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బీజేపీ కోర్ కమిటీ సమావేశమనగానే అభ్యర్థిని ఎంపిక చేయడానికోసమనే అందరూ భావించారు. కానీ గెలుపుగుర్రం కోసం వెతుకుతున్న బీజేపీ ఆ విషయంలో అలస్యంతో పాటు గోప్యతను కూడా పాటిస్తోందనే చెప్పాలి. బీజేపీ ఈ ఉపఎన్నిక కోసం డాక్టర్ రామారావు, జైపాల్ రెడ్డి, రామకృష్ణ, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, శ్రీ కళ రెడ్డి తో పాటు మరో ముగ్గురు అభ్యర్థులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీరితో పాటు టిఆర్ఎస్ కు చెందిన అప్పిరెడ్డి పేరు కూడా బలంగానే వినిపిస్తోంది. అయితే ఈ అభ్యర్థుల నుండి ఫిల్టర్ చేసి ఒక ముగ్గురు అభ్యర్థుల పేర్లను రేపు ఢిల్లీకి పంపి రెండు మూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని కమలనాథులు చెప్తున్నారు.
ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని డిసైడయిన బీజేపీ ఆ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు మున్సిపల్ బిల్లులొ తాము వ్యతిరేకిస్తున్న అంశాలను ఎలా ఎక్స్పోస్ చేయాలనే అంశాన్ని కూడా ఈ కోర్ కమిటీలో చర్చించినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 17 పై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీ అనుకున్న దానికంటే ఎక్కువ కార్యక్రమాలు జరిగినా, రావాల్సినంత క్రెడిట్ రాలేదని దీనికి గల కారణాలతో పాటు, భవిష్యత్ కార్యక్రమల్లో ఇలాంటి బ్యాక్ ఫైర్ ఎదురవ్వకుండా ఏవిధంగా ఉండాలో పునసమీక్షించుకున్నట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
బీజేపీలో చేరికలు నిరంతర ప్రక్రియ అని చెప్తోన్న నేతలు, పలు పార్టీల అసమ్మతి, అసహన నేతల చేరికలపై కూడా ఈ కోర్ కమిటీలో చర్చించినట్టు తెలుస్తోంది. మొన్నటిదాకా యజ్ఞంలా సాగిన తమ పార్టీ సభ్యత్వ నమోదు ఈ ఉప ఎన్నికలకు ఎంతగానో ఉపయోగపడుతుందనే భావనలో బీజేపీ నాయకులు ఉన్నారట. ఇక ఈ సంవత్సరం గాంధీ నూట యాభైవ జయంతి సందర్భంగా గాంధేయవాదుల సర్కిల్ లోకి ఎలా వెళ్లాలన్న చర్చ కూడా భారీ ఎత్తున జరిగిందనే వార్తలొస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోంది. సంవత్సరం పాటు ఈ సంబరాలని జరపాలని, దానిలో భాగంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 150 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఇక తెలంగాణాలో ఈ కార్యక్రమాన్ని ఏవిధంగా చేయాలి, ఈ సందర్భంగా ప్రజల్లోకి ఎలా చేరువకావాలనే అంశాలపై సీరియస్ గా కోర్ కమిటీలో చర్చించినట్టు సమాచారం.
సమావేశాలు పెట్టి చర్చించడం వల్ల ప్రయోజనం ఉండదని పక్క పార్టీలు ప్రజాక్షేత్రంలో యుద్ధం చేస్తోంటే…తమ పార్టీ నేతలు యుద్ధ సామాగ్రిని సమకూర్చుకోవడంలోనే కాలం వెల్లదిస్తున్నారని సొంత పార్టీ క్యాడర్ నుండి అసహనం వ్యక్తమవుతోంది. మొత్తానికి బీజేపీ తమ ఆలస్యంతో సైలెంట్ కిల్లింగ్ చేస్తుందో? బొక్కబోర్లా పడుతుందో వేచిచూడాలి.