తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. 2022-23 వార్షిక బడ్జెట్ ను మంత్రి హరీష్ రావు సభలో ప్రవేశపెట్టనున్నారు. అయితే.. బీఏసీ భేటీలో ఈ సమావేశాల ఎజెండాను ఖరారు చేయనున్నారు. సభ ఎన్నిరోజులు ఉండాలి.. చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఈసారి గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు జరుగుతున్నాయి. ఉభయసభలు ప్రొరోగ్ కాలేదని.. గత అక్టోబర్ లో జరిగిన సమావేశాలనే కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. శాసనసభ, మండలి ఉదయం 11 గంటల 30 నిమిషాలకు సమావేశం కానున్నాయి.
అయితే.. ఈసారి అందరి చూపు కేసీఆర్, ఈటల వైపే ఉంది. ఇన్నాళ్లు ఒకే పార్టీలో ఉండడంతో పక్కపక్కనే కూర్చున్న ఈ ఇద్దరు నేతలు.. ఇప్పుడు వేర్వేరు పార్టీలు కావడంతో సభలో ఢీ అంటే ఢీ అనే డైలాగుల యుద్ధానికి దిగుతారని అంతా భావిస్తున్నారు.
బీజేపీకి ఇన్నాళ్లు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజాసింగ్, రఘునందన్ రావు.. ఇప్పుడు వారిద్దరికి ఈటల తోడయ్యారు. ఎక్కడ ఏం మాట్లాడాలి.. ఏ అంశంపై కౌంటర్ ఇవ్వాలనే దానిపై రాజేందర్ కు మంచి పట్టు ఉంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఈ ట్రిపుల్ ఆర్ అన్ని వ్యూహాలను సిద్ధం చేసుకున్నారు. అటు కాంగ్రెస్ నేతలు కూడా ప్రభుత్వ వైఫల్యాలు, సమస్యలను ప్రస్తావించి అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్ధమైంది.
రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోళ్లు, ప్రాజెక్టులు, నదీ జలాలు, ఆర్థికపరమైన అంశాలు, కేంద్రం నుంచి నిధులు, విభజన చట్టం హామీలు, ఉద్యోగ నియామకాలు, హామీల అమలు తదితర అంశాలు ఈ సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.